గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచ్‌లు, కార్యదర్శులకు శిక్షణ
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరు
3 ఏళ్ల ప్రణాళిక తయారీపై దృష్టి
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా జిల్లాలోని మూడు డివిజన్ కేంద్రాలలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు.
కామారెడ్డి డివిజన్‌కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని కామారెడ్డి మున్సిపల్ కళాభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్‌లు, కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించారు.
3 ఏళ్ల ప్రణాళిక తయారీపై దృష్టి
కలెక్టర్ మాట్లాడుతూ 2026-27, 2027-28, 2028-29 సంవత్సరాలకు గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ప్రజల భాగస్వామ్యంతో, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి అధికారుల సహకారంతో తయారు చేయాలని సూచించారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడం, నిధుల పారదర్శక వినియోగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఈ శిక్షణలో వివరణాత్మకంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
"గ్రామ పంచాయతీయే గ్రామీణాభివృద్ధికి మూలం. సర్పంచ్‌లు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది. శిక్షణలో చెప్పే అంశాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేయాలి" అని కలెక్టర్ పేర్కొన్నారు.
కీలక సూచనలు:
- VBGIRAM G పథకం: దీని ద్వారా పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టాలి
- 16వ ఆర్థిక సంఘం నిధులు: వినియోగం, ప్రణాళిక పారదర్శకంగా ఉండాలి
- స్వంత ఆదాయం: గ్రామపంచాయతీలు తమ స్వంత ఆదాయాన్ని పెంచుకుని 16వ ఆర్థిక సంఘం నుండి 10% పెర్ఫార్మెన్స్ గ్రాంట్ పొందాలి
- ఇందిరమ్మ ఇండ్లు: మొదటి విడతలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా టాప్ 10లో నిలిచింది. రెండవ విడతలో HUT FREE జిల్లాగా మార్చేందుకు సర్పంచ్‌లు సహకరించాలి
- బడిబాట: రాష్ట్రంలో 4వ స్థానంలో ఉన్నాం. మొదటి స్థానానికి తీసుకురావడానికి కృషి చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నవోదయ సంఖ్యను పెంచాలి
ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ACLB NY గిరి, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డిపిఓ మురళి, డిఆర్డిఓ దామోదర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, డిఎల్‌పిఓ శ్రీనివాస్, ఎంపీడీవోలు, జిల్లా అధికారులు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
===================
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో డిజిటైజేషన్ వేగవంతం చేయాలి
భారత ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ పవన్ కుమార్ శర్మ ఆదేశాలు
కామారెడ్డి: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ ఆదేశించారు.
శుక్రవారం న్యూ ఢిల్లీ నుండి కార్యదర్శి నవీన్ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.
పారదర్శకతకు ప్రాధాన్యత
ఈ సందర్భంగా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకమని అన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మిగిలిన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని త్వరితగతిన పూర్తి చేసి ఈ నెల 24వ తేదీ నాటికి డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ నిర్ణీత కాల వ్యవధిలో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా గతంలో కూడా పలుమార్లు ప్రత్యేక సవరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు గుర్తు చేశారు.
అర్హులకు మాత్రమే ఓటు హక్కు
ఏ ఒక్క అర్హులైన పౌరుడు ఓటు హక్కు కోల్పోకుండా, అనర్హులు జాబితాలోకి చేరకుండా జిల్లా ఎన్నికల అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎన్యూమరేషన్ ఫారం అందజేసిన ఓటర్లందరినీ ముసాయిదా జాబితాలో చేరుస్తామని, విచారణ లేకుండా ఏ ఓటరు పేరును జాబితా నుండి తొలగించకూడదని స్పష్టం చేశారు. దరఖాస్తుదారుల అర్హతను తగిన విచారణ ద్వారా ధృవీకరించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. తుది జాబితా ప్రచురణ తర్వాత ఎవరైనా అసంతృప్తిగా ఉంటే జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణలో భాగంగా ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు.
రాష్ట్ర, జిల్లా స్థాయి పురోగతి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 99.6 శాతం, డిజిటైజేషన్ ప్రక్రియ 21.94 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన ఫారాల పంపిణీ ఈరోజు పూర్తి చేసి డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు.
కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. మ్యాపింగ్ చేసిన డాటా ఆధారంగా ఎన్యుమరేషన్ ఫారాలను సరిచూసుకొని డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, కామారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, ఎన్నికల విభాగం సూపరిండెంట్ రాజేశ్వర్, ఎన్నికల విభాగం సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




Post a Comment