సిద్దిపేటలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం
సిద్దిపేట ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే నా తపన: హరీశ్ రావు
(దాస శ్రీనివాస్ - సిద్దిపేట )
సిద్దిపేట ప్రజలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తన తపన అని, మీ ఆరోగ్యం కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
బుధవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో హైదరాబాద్ కు చెందిన సింధు క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో జూలై 29, 30 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు వార్డుల నుంచి వచ్చిన మహిళలను ఆప్యాయంగా పలకరించారు.
హరీశ్ రావు ఏమన్నారంటే:
- ముందస్తు పరీక్షలు చేయించుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. స్క్రీనింగ్ పరీక్షలకు సమయం కేటాయించి జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి.
- క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఆలస్యం చేస్తేనే మరింత ప్రమాదం.
- 40 ఏళ్లు దాటిన మహిళలు విధిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకోవాలి.
- వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు క్యాన్సర్ రోగుల బాధలు నాకు తెలుసు. చాలా మంది మూడు, నాలుగవ స్టేజిలో వైద్యం కోసం వచ్చేవారు.
ఉచిత స్క్రీనింగ్ శిబిరం వివరాలు:
హైదరాబాద్ కు చెందిన సింధు క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ పార్థసారథిని కోరడంతోనే సిద్దిపేటలో ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. పేద ప్రజల కోసమే సింధు క్యాన్సర్ ఆసుపత్రిని డాక్టర్ పార్థసారథి నెలకొల్పారని అన్నారు. రెండు రోజులపాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. రూ. 2.50 కోట్ల విలువ గల అత్యాధునిక పరికరాలతో కూడిన మొబైల్ వాహనం వచ్చింది. ఆ వాహనంలో మెమోగ్రాఫ్, ఎక్స్రే, ఎగ్జామినేషన్ రూమ్, శాంపిల్ కలెక్షన్ సదుపాయాలు ఉన్నాయి. స్క్రీనింగ్ లో లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్య చికిత్సలు అందించేందుకు సింధు ఆసుపత్రి సిద్ధంగా ఉంది.
సిద్దిపేటలో శాశ్వత స్క్రీనింగ్ సెంటర్:
సిద్దిపేటలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అందుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి తరహాలోనే సేవలను సిద్దిపేట ప్రజలకు అందిస్తామన్నారు.
1000 పడకల ఆసుపత్రిపై ఆగ్రహం:
పేద ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో సిద్దిపేటలో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మించామని తెలిపారు. దాదాపు 95 శాతం పూర్తయిన ఆసుపత్రికి మిగిలిన 5 శాతం నిధులు కూడా కేటాయించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమన్నారు. వెంటనే నిధులు కేటాయించి 1000 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేటలో హోమియోపతి, యునాని, ఆయుర్వేద ఆసుపత్రులను కూడా తీసుకువచ్చామని, ఆ ఆస్పత్రులకు వైద్యులు, సిబ్బందిని నియమించడంలో కూడా మూడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో సింధు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేష్, వైద్యురాలు త్రిష, వైస్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment