Top News

Hospital Staff Protest | మాతా శిశు ఆసుపత్రి ముందు నర్సులు, సిబ్బంది ఆందోళన

మాతా శిశు ఆసుపత్రి ముందు నర్సులు, సిబ్బంది ఆందోళన

సస్పెండ్, విధుల నుంచి తొలగింపు ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్ 

బాన్సువాడ : మాత శిశు ఆసుపత్రిలో ఇటీవల జరిగిన బాలింతల అస్వస్థత ఘటనలో ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ మంగళవారం ఆసుపత్రి సిబ్బంది ఆందోళన చేపట్టారు.  గత 20 రోజుల క్రితం మాత శిశు ఆసుపత్రిలో కొంతమంది బాలింతలు అస్వస్థతకు గురైన ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో ఇద్దరు స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేయగా, అనస్థీషియా విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఒక డాక్టర్‌ను విధుల నుంచి తొలగించారు.  

ఆసుపత్రి ముందు నిరసన:  

ఈ చర్యలను వ్యతిరేకిస్తూ మంగళవారం మాత శిశు ఆసుపత్రి ప్రధాన ద్వారం ముందు నర్సులు, ఆసుపత్రి సిబ్బంది పెద్ద ఎత్తున గుమిగూడి నిరసన తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది చేతులు ఎత్తి నినాదాలు చేస్తూ, "సస్పెండ్ ఉత్తర్వులను రద్దు చేయాలి", "వైద్య సిబ్బందిపై వేటు వద్దు" అంటూ నినాదాలు చేశారు.  కొంతమంది మహిళా సిబ్బంది చేతులు పైకెత్తి నిరసన వ్యక్తం చేయగా, పురుష సిబ్బంది కూడా వారికి మద్దతుగా నిలిచారు.    

ఆందోళన చేసిన సిబ్బంది మాట్లాడుతూ, ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరపకుండా ఏకపక్షంగా చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. సిబ్బంది కొరత, పరికరాల సమస్యల మధ్య విధులు నిర్వహిస్తున్నామని, కేవలం ఇద్దరు నర్సులు, ఒక డాక్టర్‌పై చర్యలు తీసుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు.  

సస్పెండ్ చేసిన ఇద్దరు స్టాఫ్ నర్సుల సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలని, తొలగించిన అనస్థీషియా డాక్టర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.  

ఈ అంశంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందిస్తూ, రోగుల భద్రతే ప్రధానమని, విచారణలో వెల్లడైన వాస్తవాల ఆధారంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. అయితే సిబ్బంది సమస్యలపై కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.  



Post a Comment

Previous Post Next Post