Top News

One More Dog Bite | మరో చిన్నారిపై కుక్కల దాడి


బాన్సువాడలో వీధి కుక్కల బెడద  
మదీనా కాలనీ ఘటన మరువకముందే.. మరో చిన్నారిపై దాడి
రెండు రోజుల్లో ఐదుగురు చిన్నారులను కరిచిన కుక్కలు 
తల్లిదండ్రులారా.... పిల్లలు జాగ్రత్త! 
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. వరుసగా చిన్నారులపై దాడులు జరుగుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మరోసారి చిన్నారిపై దాడి
నిన్న మదీనా కాలనీలో రెండేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ప్రజలు మరువకముందే, గురువారం కోటగల్లీలో సానియా (7) అనే బాలికపై కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో బాలికకు గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిల్లలను ఇళ్ల బయటకు పంపాలంటేనే ఆందోళన చెందుతున్నామని స్థానికులు చెబుతున్నారు.
మదీనాకాలనీలో కుక్కల దండు వీడియో 👇


జూలై 29న నలుగురు చిన్నారులపై దాడి
బాన్సువాడ పట్టణంలో మంగళవారం వీధి కుక్కల దాడిలో 4 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికుల కథనం ప్రకారం, ఈ పిల్లలు ఇళ్ల ముందు ఆటలాడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కల గుంపు వచ్చి దాడి చేసింది. పిల్లల కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కలను తరిమికొట్టి పిల్లలను కాపాడారు.
వీరిలో 3 ఏళ్ల జైనబ్ మరియు 6 ఏళ్ల సాయి రిత్విక్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరు పిల్లలకు బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్  పరామర్శ
మదీనా కాలనిలో కుక్కలు కరిచి నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనబ్ ను బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గంగాధర్ పరామర్శించారు.
వీధి కుక్కలను నియంత్రించాలని  ప్రజల డిమాండ్
ఈ వరుస ఘటనలతో బాన్సువాడ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పట్టణంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, చిన్న పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వీధి కుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాన్సువాడ మున్సిపల్ కమీషనర్, చైర్‌పర్సన్ వెంటనే స్పందించి పట్టణంలోని వీధి కుక్కలను నియంత్రించి, అమాయక పిల్లల భద్రతను కాపాడాలని కోరుతున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని, వీధి కుక్కలు కనిపిస్తే దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


కుక్కల బారి నుండి చిన్నారుల భద్రతకు పురపాలక సంఘం ప్రత్యేక చర్యలు : మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ 

ఇటీవల పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేసిన సంఘటనల నేపథ్యంలో, పురపాలక సంఘం దీనిని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి తక్షణ చర్యలు చేపట్టింది.

పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వీధి కుక్కలను గుర్తించి పట్టుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో జంతు సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది.

ప్రజలకు విజ్ఞప్తి:

చిన్న పిల్లలను ఒంటరిగా వీధుల్లోకి పంపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

వీధి కుక్కలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదు.

కుక్కలు గుంపులుగా సంచరిస్తున్న ప్రాంతాలకు పిల్లలను వెళ్లనివ్వకండి.

ఎక్కడైనా వీధి కుక్కల వల్ల ప్రమాదకర పరిస్థితులు కనిపించినట్లయితే వెంటనే పురపాలక సంఘానికి సమాచారం అందించండి.

పిల్లలు పాఠశాలకు వెళ్లే సమయంలో మరియు తిరిగి వచ్చే సమయంలో పెద్దల పర్యవేక్షణ ఉండేలా చూడండి.

ప్రజల సహకారంతోనే ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం సాధ్యమవుతుంది. చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పురపాలక సంఘానికి సహకరించాలని కోరుతున్నాము. అలాగే నిన్న జరిగిన కుక్కల దాడిలో గాయపడిన చిన్నారిని మరియు కుటుంబ సభ్యులను పురపాలక సంఘం కమీషనర్  గోపు గంగాధర్ పరామర్శించి దాడి జరిగిన ఘటన విషయము తెలుసుకోవడం జరిగినది.


Post a Comment

Previous Post Next Post