Top News

Quick Response on Dial 100 | చెరువులో దూకిన మహిళను ప్రాణాలతో కాపాడిన పిట్లం పోలీసులు

 

డయల్-100కు తక్షణ స్పందన  

చెరువులో దూకిన మహిళను ప్రాణాలతో కాపాడిన పిట్లం పోలీసులు

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: డయల్-100కు అందిన సమాచారంపై పిట్లం పోలీసులు తక్షణమే స్పందించి ఆత్మహత్యాయత్నం నుంచి ఓ మహిళను ప్రాణాలతో కాపాడారు.

పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు సాయంత్రం సుమారు 7:00 గంటలకు స్థానిక రామాలయం చెరువులో ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు దూకినట్లు డయల్-100కు సమాచారం అందింది.

సమయస్ఫూర్తితో సహాయక చర్యలు

సమాచారం అందుకున్న వెంటనే పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు తన సిబ్బంది నవీన్, నదీమ్, చంద్రయ్యతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

ఈ క్రమంలో పిట్లం సర్పంచ్ చంద్రశేఖర్, గజ ఈతగాళ్లు గున్నింగి సాయిలు, అబ్బుగాని లచ్చయ్య సహకారంతో చెరువులో ఉన్న మహిళను సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. 

అనంతరం 108 అంబులెన్స్ ద్వారా ఆమెను చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల కారణంగా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది.

ఎస్పీ ప్రశంస

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS మాట్లాడుతూ డయల్-100కు వచ్చే ప్రతి అత్యవసర సమాచారంపై పోలీసులు అత్యంత వేగంగా స్పందిస్తూ ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని తెలిపారు. 

కుటుంబ లేదా వ్యక్తిగత సమస్యలతో ఎవరూ ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, అలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించి సహాయం పొందాలని సూచించారు.

డయల్-100కు సమాచారం అందించడంతో పాటు, సమయస్ఫూర్తితో స్పందించి మహిళ ప్రాణాలను కాపాడిన పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు, పోలీసు సిబ్బంది, పిట్లం సర్పంచ్ చంద్రశేఖర్, గ్రామస్తులు, గజ ఈతగాళ్లు గున్నింగి సాయిలు, అబ్బుగాని లచ్చయ్యలను జిల్లా ఎస్పీ అభినందించారు.




Post a Comment

Previous Post Next Post