Top News

Telangana Activists | స్వరాష్ట్ర సాధనలో సరిహద్దు జిల్లాల కీలక పాత్ర

ఉత్తర తెలంగాణ ఉద్యమకారులతో ముఖాముఖి విజయవంతం  

250 గజాల స్థలం, పెన్షన్, రిజర్వేషన్లు సహా 7 ప్రధాన డిమాండ్లు

స్వరాష్ట్ర సాధనలో సరిహద్దు జిల్లాల కీలక పాత్ర  

"ఇది భిక్ష కాదు - ఆత్మగౌరవ హక్కు" - కమిటీ  

జూలై 22 వరకు ముఖాముఖిలు కొనసాగింపు

తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ - జీవో నెం. 679 ఆధ్వర్యంలో నేడు అమరవీరుల స్మారక చిహ్నం "అమరదీపం"లో ఉత్తర తెలంగాణ జిల్లాల ముఖాముఖి సమావేశం విజయవంతంగా జరిగింది. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులు పాల్గొని తమ డిమాండ్లను కమిటీ ముందు ఉంచారు.

కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ ఎమ్. కోదండరామ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మోతె శోభన్ రెడ్డి, ఎస్. రాములు నాయక్ తదితరులు హాజరై ఉద్యమకారుల నుంచి సూచనలు, ఆనాటి ఉద్యమ ఆధారాలను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ జిల్లాల ఉద్యమకారులు స్వరాష్ట్ర సాధనలో మేజర్ రోల్ పోషించారని కొనియాడారు. విద్యార్థులు, ఆర్టీసీ, సింగరేణి కార్మికులు రహదారులను స్తంభింపజేసి ఉద్యమాన్ని ఉధృతం చేశారని, ఆ పోరాట పటిమే నేటి స్వరాష్ట్రానికి పునాది అని పేర్కొన్నారు.

ఉద్యమకారులు ప్రధానంగా కోరిన డిమాండ్లు:

- 250 గజాల నివాస స్థలం: సొంత ఇల్లు లేని ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి ఉచిత భూమి కేటాయింపు

- గౌరవప్రదమైన నెలవారీ పెన్షన్: వృద్ధాప్యంలో ఆత్మగౌరవంతో జీవించేందుకు జీవితకాల పెన్షన్

- తదుపరి తరానికి రిజర్వేషన్లు: ఉద్యమకారుల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా

- మహిళా ఉద్యమకారులకు ప్రాధాన్యత: స్వయం ఉపాధి పథకాల్లో ప్రత్యేక అవకాశాలు

- ఉచిత కార్పొరేట్ వైద్యం: డిజిటల్ హెల్త్ కార్డుల ద్వారా ఉచిత వైద్య సేవలు

- KG to PG ఉచిత విద్య: ఉద్యమకారుల పిల్లలకు పూర్తి ఉచిత విద్య

- ఉచిత TSRTC ప్రయాణం: వృద్ధ ఉద్యమకారులకు జీవితకాల ఉచిత బస్ పాస్

సమావేశం ముగింపులో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మాట్లాడుతూ "ఇది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు. మీ రక్తం, చెమట చిందించి సాధించుకున్న ఆత్మగౌరవ హక్కు" అని అన్నారు. I&PR ద్వారా పూర్తి డిజిటల్ రికార్డింగ్ జరుగుతోందని, ఒక్క ఉద్యమకారుడికి కూడా అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.

జూలై 22 వరకు ఈ ముఖాముఖిలు నిరంతరాయంగా కొనసాగుతాయని, ఈ సంక్షేమ అంశాలతో కూడిన సమగ్ర నివేదికను సీఎం  ఎ. రేవంత్ రెడ్డికి సమర్పించి త్వరిత న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు స్పష్టం చేశారు.

Post a Comment

Previous Post Next Post