గోదాముల్లోని లక్క పురుగులతో మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు
మోషంపూర్, ఉప్పల్ వాయి గోదాముల వద్ద ధర్నా - అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
కామారెడ్డి: రామారెడ్డి మండలం మోషంపూర్, ఉప్పల్ వాయి, పోసానిపేట గ్రామాల ప్రజలు గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యానికి పట్టిన లక్క పురుగులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్క పురుగులు ఇళ్లలోకి వచ్చి ఆహారంలో, తాగునీటిలో పడుతున్నాయని, పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపిస్తూ నేడు మోషంపూర్, ఉప్పల్ వాయి గ్రామ శివారులోని గోదాముల వద్ద మూడు గ్రామాల ప్రజలు ధర్నా నిర్వహించారు.
ఇళ్లలోకి చేరుతున్న లక్క పురుగులు
గోదాముల్లో నిల్వ ఉంచిన ధాన్యానికి పట్టిన లక్క పురుగులు మూడు గ్రామాల ఇళ్లలోకి పెద్ద ఎత్తున చేరుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వంట చేసుకునే ఆహారంలో, తాగే నీటిలో సైతం ఈ పురుగులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
ముఖ్యంగా చిన్న పిల్లల చెవుల్లోకి లక్క పురుగులు వెళ్లి అనారోగ్యానికి కారణమవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందారు. పురుగుల కారణంగా పిల్లలు తరచూ అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
గోదాం యాజమాన్యం, సంబంధిత అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు, లేనిపక్షంలో ప్రతి ఇంటి నుంచి ఒకరు చొప్పున వచ్చి గోదాం ముందు వంట వార్పు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.

Post a Comment