Top News

TGSRTC | జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు తాత్కాలిక నిలిపివేత

ప్రయాణీకుల భద్రతే ధ్యేయం: జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు తాత్కాలిక నిలిపివేత  

వరుస బ్యాటరీ ప్రమాదాల నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం  

హైదరాబాద్ బస్ భవన్‌లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు  

100% సేఫ్టీ సర్టిఫికేట్ వస్తేనే సర్వీసుల పునరుద్ధరణ  

హైదరాబాద్, తెలంగాణ డైలీ న్యూస్:  

నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో నడుస్తున్న జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులలో వరుసగా హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, ప్రయాణీకుల భద్రతను దృష్ట్యా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల పరిధిలో తిరిగే జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల కార్యకలాపాలను తాత్కాలిక నిలిపివేతకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.  

గత నెల జూన్ 21వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కరీంనగర్ సమీపంలో అలుగునూర్ వద్ద జరిగిన బస్సు అగ్ని ప్రమాదంపై పూర్తి నివేదిక రాకమునుపే మరొక సంఘటన జరగడం వలన ప్రయాణీకులు, సిబ్బంది, ప్రజల ప్రాణాల రక్షణే అత్యంత ప్రాధాన్యతగా భావించి, తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.  

తదుపరి చర్యలు, షరతులు  

తెలంగాణ ఆర్టీసీ జేబీఎం సంస్థను ప్రమాదాల విశ్లేషణ నివేదిక, శాశ్వత నివారణ చర్యలు, బ్యాటరీ ఫిట్నెస్ సర్టిఫికేషన్, హైదరాబాద్ బస్సు భవన్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు మరియు భద్రతకు సంబంధించిన పలు అంశాలపై స్పందించి తగు నివేదిక సమర్పించవలసిందిగా కోరడం జరిగింది.  

పునరుద్ధరణపై నిర్ణయం  

ఆర్టీసీ విజ్ఞాపనపై స్పందించిన జేబీఎం సంస్థ పైన పేర్కొన్న పలు అంశాలపైన తక్షణమే నివేదికలు సిద్ధం చేసేందుకు వారి టెక్నికల్ టీం మరియు చైనా నుంచి బ్యాటరీ నిపుణుల బృందం కూడా ప్రమాద పరిస్థితులు, వాటికి దారి తీసిన సందర్భాలను పరిశీలించి పలు నివారణ చర్యలపై నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి.  

భద్రతా ప్రమాణాలు, సంబంధిత నివేదికలను ఆర్టీసీ ఉన్నతాధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, సంస్థ నిర్దేశించిన అన్ని షరతులను జేబీఎం యాజమాన్యం పూర్తిగా పాటించినట్లు సంతృప్తి చెందిన పిదప, వారి టెక్నికల్ బృందం Vehicle Fit for Operation అని ధృవీకరించిన వాహనాల పునరుద్ధరణపై తుది నిర్ణయం తీసుకోబడుతుంది.  

ప్రజారవాణాలో భద్రత విషయంలో టీజీఎస్ ఆర్టీసీ ఎటువంటి రాజీ పడదని, ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఈ సందర్భంగా యాజమాన్యం స్పష్టం చేసింది.

Post a Comment

Previous Post Next Post