భిక్నూర్ పోలీసుల సత్తా
48 గంటల్లో ఇంటి చోరీ కేసు ఛేదన
"దృశ్యం" సినిమా తరహా అలిబీ బెడిసికొట్టింది
చోరీ చేసిన బంగారం, వెండి పూర్తిగా రికవరీ
జిల్లా ఎస్పీ నుంచి బృందానికి అభినందనలు
కామారెడ్డి: భిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజీ, శాస్త్రీయ దర్యాప్తుతో ఒక మహిళను అరెస్ట్ చేసి చోరీకి గురైన మొత్తం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. (వీడియో 👇)
ఘటన ఎలా జరిగింది ?
జంగంపల్లి గ్రామానికి చెందిన దొడ్ల స్వామి, తండ్రి నర్సయ్య 16.07.2026 న వ్యవసాయ పనుల కోసం బయటకు వెళ్లారు. ఆయన భార్య విజయ ఇంట్లోని బీరువాలో సుమారు 6 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు ఉంచి తాళం వేసి వెళ్లారు.
సాయంత్రం తిరిగి వచ్చి చూడగా బయట గేటు తాళం యథావిధిగా ఉంది. కానీ లోపలి గదులు, బీరువా తాళాలు పగిలి ఉన్నాయి. బీరువాలోని విలువైన వస్తువులు కనిపించలేదు. దీనిపై ఫిర్యాదుదారుడు భిక్నూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాలతో కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో భిక్నూర్ సీఐ జె. నరేష్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి.
సీసీ కెమెరా పరిశీలన, సాంకేతిక సమాచారం, క్షుణ్ణమైన విచారణ ఆధారంగా అదే గ్రామానికి చెందిన దొడ్లె లత, 27, భర్త నాగరాజు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
అలిబీ ప్లాన్ బట్టబయలు
దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు నిందితురాలు ఆ రోజు తాను కామారెడ్డిలో షాపింగ్ కు వెళ్లానంటూ బస్సు టికెట్లు, బిల్లులు చూపించింది. "దృశ్యం" సినిమాలో లాగా అలిబీ సృష్టించి పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది. అయితే సాంకేతిక ఆధారాలు, డిజిటల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజీలను పోల్చి చూడడంతో ఆమె అబద్ధం బయటపడింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది.
స్వాధీనం చేసుకున్న సొత్తు
నిందితురాలి వద్ద నుంచి చోరీకి గురైన మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.
3.34 తులాల బంగారు గుండ్లు
0.50 తులాల బంగారు చెవి కమ్మలు
0.29 తులాల బంగారు మాటీలు
0.10 తులాల చిన్న బంగారు మాటీలు
0.039, 0.14 తులాల బంగారు ముక్కుపుడకలు
25.60, 17.90, 6.70 తులాల మూడు జతల వెండి పట్ట గొలుసులు
56.39 తులాల వెండి కాళ్ల కడియాలు
35.90 తులాల సలాన్ వెండి కాళ్ల కడియాలు
అధికారుల ప్రశంస
రెండు రోజుల్లోనే కేసు ఛేదించి సొత్తు రికవరీ చేయడం పోలీసు శాఖ చురుకుదనానికి నిదర్శనమని కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్ అన్నారు.
ఈ కేసులో కీలకంగా పనిచేసిన భిక్నూర్ సీఐ జె. నరేష్, ఎస్‌ఐ ఎస్. అనిల్, ఏఎస్‌ఐ వెంకటరావు, పీసీలు శ్రీకాంత్, కిషన్ గౌడ్, బాలకృష్ణ మరియు బృంద సభ్యులను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.


Post a Comment