కామారెడ్డిలో అంతర్‌జిల్లా బైక్ చోరీ ముఠా అరెస్ట్
4 దొంగిలించిన బైక్‌లు స్వాధీనం - ఐదుగురు అరెస్ట్
కామారెడ్డి, ఆగస్టు 8: కామారెడ్డి జిల్లాలో సులభంగా డబ్బు సంపాదించేందుకు అంతర్‌జిల్లా స్థాయిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఫిర్యాదుతో మొదలైన దర్యాప్తు
సదాశివనగర్ గ్రామానికి చెందిన హనుమంత్ రాజు తన బజాజ్ పల్సర్ బైక్ నం. TS-08-HY-8176 ను జూలై 24 రాత్రి ఇంటి ముందు పార్క్ చేశాడు. మరుసటి రోజు బైక్ కనిపించకపోవడంతో సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాలతో ఎల్లారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో, సదాశివనగర్ సీఐ బి. సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో, ఎస్‌ఐ పుష్పరాజ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, నిందితుల కదలికల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇలా చేసేవారు చోరీలు
దర్యాప్తులో షేక్ ఇమ్రాన్, అద్నాన్ ఖాన్, సయ్యద్ జుబేర్, షేక్ అయాన్, సచిన్ విశ్వనాథ్ ఖండేవాల్ ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది.
ఇమ్రాన్, అద్నాన్ ఖాన్‌లు TVS Rider బైక్‌పై హోటళ్లు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్ల వద్ద పార్క్ చేసిన బైక్‌లను రెక్కీ చేసేవారు. అనుకూలంగా ఉన్న బైక్‌లను దొంగిలించి జుబేర్, అయాన్, సచిన్‌లకు తక్కువ ధరకు విక్రయించేవారు.
ఈ ముగ్గురు అసలు నంబర్ ప్లేట్లను తీసేసి నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చి పోలీసులకు దొరకకుండా వాడేవారు. ఆ తర్వాత వాటిని ఎక్కువ ధరకు అమ్మి లాభాలు పొందేవారు. సదాశివనగర్‌లో దొంగిలించిన హనుమంత్ రాజు బైక్‌ను సచిన్‌కు రూ.7,000కు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.
ఎక్స్ రోడ్ వద్ద పట్టుబడ్డ ముఠా
ఆగస్టు 8న పద్మాజీవాడి ఎక్స్ రోడ్ బ్రిడ్జి వద్ద పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను గమనించారు. జుబేర్, అయాన్, సచిన్‌లు నకిలీ నంబర్ ప్లేట్లున్న పల్సర్ బైక్‌లపై ఉండగా, ఇమ్రాన్, అద్నాన్ మరో బైక్‌ను దొంగిలించి హైదరాబాద్‌లో అమ్మేందుకు వెళ్తున్నారు.
పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాలను అంగీకరించారు.
స్వాధీనం చేసిన వాహనాలు:
నిందితుల వద్ద నుంచి పోలీసులు 4 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు:
1. Baj Pulsar - అసలు: MH-26-CT-8348 | నకిలీ: TS-18-A-9446
2. Baj Pulsar - అసలు: TG-18-B-1382 | నకిలీ: TG-16-3642
3. Baj Pulsar- అసలు: TS-08-HY-8176 | నకిలీ: MH-26-CB-1576
4. TVS Rider- TG-16-0674 - నేరాలకు ఉపయోగించిన బైక్
నిందితులు వాడిన మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్ బృందానికి ప్రశంసలు
ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసిన ఎల్లారెడ్డి డీఎస్పీ, సీఐ బి. సంతోష్ కుమార్, ఎస్‌ఐ పుష్పరాజ్, సిబ్బంది MD అజహర్ ఫరూక్, ARPC శంకర్, CCS టీమ్ రవి, గణపతిలను ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అభినందించారు.

Post a Comment