ప్రతినెలా 150కు పైగా మొబైల్ ఫోన్ల రికవరీ
ఈ ఏడాది ఇప్పటివరకు ₹1.59 కోట్ల విలువైన 994 ఫోన్లు స్వాధీనం
గత 20 రోజుల్లోనే ₹32 లక్షల విలువైన 200 ఫోన్లు రికవరీ
CEIR పోర్టల్ ద్వారా ఇప్పటివరకు ₹8.44 కోట్ల విలువైన 5275 ఫోన్లు బాధితులకు అప్పగింత
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర
కామారెడ్డి: మొబైల్ ఫోన్ పోయిందని లేదా చోరీకి గురైందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సులభంగా తిరిగి పొందవచ్చని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు.
ప్రస్తుత డిజిటల్ కాలంలో మొబైల్ ఫోన్ కేవలం సమాచార సాధనం మాత్రమే కాకుండా బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు, కీలకమైన డేటాను కలిగి ఉండే అత్యంత ముఖ్యమైన పరికరమని ఆయన పేర్కొన్నారు. ఫోన్ పోగొట్టుకోవడం వల్ల వ్యక్తిగత భద్రతకు, గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున, జిల్లా పోలీసు యంత్రాంగం మొబైల్ ఫోన్ల రికవరీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని వివరించారు.
ప్రత్యేక సాంకేతిక బృందం ఏర్పాటు
బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలనే లక్ష్యంతో ఇన్‌స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో, ఆర్‌ఎస్‌ఐ బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రతి నెల సగటున 150 కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తోందని కొనియాడారు.
రికవరీ గణాంకాలు
జిల్లాలో రికవరీల గణాంకాలను వెల్లడిస్తూ.. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గత 20 రోజుల్లోనే ₹32 లక్షల విలువైన 200 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని, అలాగే ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు ₹1.59 కోట్ల విలువైన 994 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గత ఏడాది కూడా సుమారు ₹3 కోట్ల విలువైన 1,834 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని గుర్తుచేశారు.
సీఈఐఆర్ (CEIR) పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో మొత్తం 5275 మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి, గుర్తించి సుమారు ₹8.44 కోట్ల విలువైన ఫోన్లను బాధితులకు విజయవంతంగా అప్పగించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా మొబైల్ రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రత్యేక బృందాన్ని ఆయన అభినందించారు.
ప్రజలకు సూచనలు
మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, కాలయాపన చేయకుండా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, దుర్వినియోగం కాకుండా సిమ్ కార్డును బ్లాక్ చేయాలని సూచించారు. అనంతరం CEIR పోర్టల్‌లో ఫోన్ IMEI నంబర్‌ను బ్లాక్ చేయాలని కోరారు.
పోయిన మొబైల్ ఫోన్ల ద్వారా సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉన్నందున, గుర్తుతెలియని లింకులు, అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రికవరీ అయిన మొబైల్ ఫోన్లను పొందేందుకు బాధితులు తమ వద్ద ఉన్న సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఐ బాలరాజు (ఫోన్: 8712686114) ను సంప్రదించి తమ మొబైల్ ఫోన్లను పొందవచ్చు.


Post a Comment