రామారెడ్డిలో చాట్ల నర్సయ్య, గంగమణి సంస్మరణ సభ
చాట్ల నర్సయ్య విగ్రహం, స్మారక సంచిక ఆవిష్కరణ
నర్సయ్య రచనలను తెలంగాణ వ్యాప్తంగా తీసుకొస్తాం: చాట్ల కుటుంబం
కామారెడ్డి: రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామ శివారులోని చాట్ల వ్యవసాయ క్షేత్రంలో చాట్ల నర్సయ్య, గంగమణి దంపతుల సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు.ముందుగా దంపతుల పాలరాతి విగ్రహాలను ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం చాట్ల నర్సయ్య జ్ఞాపకార్థం రూపొందించిన సంస్మరణ సంచికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారి కుమారుడు చాట్ల విజయకృష్ణ, కుమార్తె చాట్ల విద్యుల్లత మాట్లాడుతూ చాట్ల నర్సయ్య రచనలు, సేవలను సమాజానికి మరింతగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆయన రచనలను తెలంగాణ వ్యాప్తంగా వెలుగులోకి తీసుకురావడంతో పాటు వ్యాస సంకలనం, కామారెడ్డి కవుల చరిత్ర వంటి పుస్తకాలను కూడా ప్రచురిస్తామని చెప్పారు. యువత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా వారికి సేవ చేయాలని సూచించారు. నర్సయ్య జీవితాంతం ఇతరుల కోసం సేవ చేశారని, కళాకారులు, రచయితలు, కవుల కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. నర్సయ్య స్మారకార్థం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి భవిష్యత్‌లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్ మోహన్, నిర్వాహకుడు చాట్ల ప్రణీత్, మాజీ కౌన్సిలర్ వంశీకృష్ణ, దినేష్ రెడ్డితో పాటు పలువురు రచయితలు, కవులు పాల్గొన్నారు.

Post a Comment