ఓటరు జాబితా సవరణ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ప్రతిమ సింగ్
- కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రేపు గ్రామ సభలు
- పారదర్శకంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి లక్ష్యం
కామారెడ్డి:
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో అన్ని మండలాలు, గ్రామాల్లో గురువారం (27.08.2026) ఈ సభలు జరగనున్నాయని ఆమె వెల్లడించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా అత్యంత పారదర్శకంగా పూర్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.
ముసాయిదా జాబితా బహిరంగ పఠనం
గ్రామ సభల్లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల సమక్షంలో బహిరంగంగా చదివి వినిపిస్తారని తెలిపారు. ఇందులో ప్రధానంగా మరణించిన ఓటర్లు, నివాసాలు మారిన వారు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో పేర్లు నమోదైన వారు, అలాగే సభకు గైర్హాజరైన ఓటర్ల జాబితాలను చదివి వినిపించనున్నట్లు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా తప్పులతడక లేకుండా సక్రమంగా ఉండటమే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమని కలెక్టర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు కావడానికి, అనర్హుల తొలగింపునకు ప్రజలందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని గుర్తుచేశారు.
ప్రజలందరూ పాల్గొనాలి
ప్రతి ఓటరు విధిగా ఈ గ్రామ సభలకు హాజరై జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఒకవేళ జాబితాలో పేరు, చిరునామా తదితర వివరాల్లో ఏవైనా పొరపాట్లున్నా, లేదా అనర్హుల పేర్ల తొలగింపుపై ఏమైనా అభ్యంతరాలున్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సభల్లో బూత్ స్థాయి అధికారులు (BLOలు), సూపర్‌వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొని ఓటర్లకు నోటీసులు జారీ చేయడం, విచారణ జరపడం, అభ్యంతరాల నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తారని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు
ఒక ప్రశ్న: మీ ప్రాంతంలో జరిగే ఈ ఓటరు జాబితా సవరణ గ్రామ సభలకు హాజరై మీ ఓటు వివరాలను పరిశీలించుకున్నారా? Comment Box లో రెస్పాండ్ కాగలరు.

Post a Comment