బాన్సువాడలో ఘనంగా మిలాద్-ఉన్-నబి వేడుకలు
భారీ ర్యాలీ, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, అన్న దానం
బాన్సువాడ: ముస్లింల మహా ప్రవక్త హజ్రత్ మహమ్మద్ (స.అ.వ) జన్మదినాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలో బుధవారం మిలాద్-ఉన్-నబి వేడుకలు ఘనంగా, ప్రశాంతంగా జరిగాయి.
భారీ ర్యాలీతో సందడి:
అహలె సున్నత్ వల్ జమాత్, మర్కజ్ నూర్ మసీద్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని నూర్ మసీద్ నుండి ప్రారంభమైన ర్యాలీ తాడ్కోల్ చౌరస్తా, ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది.
ముస్లిం యువకులు, పెద్దలు చేతుల్లో ఆకుపచ్చ జెండాలు, కలిమా జెండాలు పట్టుకుని నారే తక్బీర్, నారే రిసాలత్ నినాదాలతో పట్టణం మార్మోగింది. వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో బాన్సువాడ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్ పాల్గొని ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సోదరభావం, మానవత్వం సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ ర్యాలీలో ముస్లిం మత పెద్దలు మహ్మద్ ఏజాజ్, వహాబ్, మఖ్దూమ్, మహ్మద్ గౌస్, ఆరిఫ్, హకీమ్, హాజీ, ఇసాక్, అతిఫ్ తదితరులు పాల్గొన్నారు. వీడియో 👇
దర్గాలో ప్రార్థనలు, అన్నదానం:
ర్యాలీ అనంతరం భక్తులంతా నేక్ బీ దర్గాకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మానవత్వానికి నిదర్శనంగా హ్యూమానిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
భద్రతా ఏర్పాట్లను బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. పోలీస్ బలగాలు ర్యాలీ వెంట ఉండి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంతకుముందు రాత్రి జల్సా-ఎ-సీరతున్నబీ:
అంతకుముందు రోజు రాత్రి బాన్సువాడ జామా మస్జిద్ మర్కజ్ లో జల్సా-ఎ-సీరతున్నబీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తంజీముల్ మసాజిద్ ఇంతేజామీ కమిటీ ఆధ్వర్యంలో ఇషా నమాజ్ అనంతరం ఈ జల్సా నిర్వహించారు.
నిజామాబాద్ కు చెందిన ప్రముఖ ఆలిమ్-ఎ-దీన్ హజ్రత్ మౌలానా ముఫ్తీ మహమూద్ సాహెబ్ ఖాస్మి (ఉస్తాద్-ఎ-అరబీ, మదరసా మజాహిరుల్ ఉలూమ్, ఇమామ్-ఓ-ఖతీబ్, ఖిలా మస్జిద్) ముఖ్య వక్తగా పాల్గొని ప్రవక్త జీవిత విధానం, శాంతి, ప్రేమ, సోదరభావం గురించి వివరించారు. చివరిలో దేశ శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రత్యేక దువా చేశారు.






Post a Comment