Top News

Kavita Speech | నా నమ్మకం మీరే - నిజామాబాద్ ప్రజలే నా బలం : కవిత భావోద్వేగ ప్రసంగం

నా నమ్మకం మీరే - నిజామాబాద్ ప్రజలే నా బలం : కవిత భావోద్వేగ ప్రసంగం

కాంగ్రెస్ దొంగ హామీలతో ప్రజలను మోసం చేసింది - ఉచిత బస్సు తప్ప ఏమీ చేయలేదు

బీఆర్ఎస్, కాంగ్రెస్ సర్కార్లు షుగర్ ఫ్యాక్టరీలను పట్టించుకోలేదు - బీడీ కార్మికులకు అన్యాయం

తీహార్ జైల్లో పెట్టి వేధించారు - సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది : కల్వకుంట్ల కవిత

పాంచజన్య సంకల్ప సభలో కన్నీళ్లు పెట్టుకున్న కవిత

నిజామాబాద్, తెలంగాణ డైలీ న్యూస్:

నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో సోమవారం నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. సభలో ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "మళ్లీ చెబుతున్నా, నా నమ్మకం మీరే. ఈ రాష్ట్రంలో ఇంకా చేయాల్సింది ఉంది, మారాల్సింది ఉంది. అందుకే మీ బిడ్డగా ముందుకు సాగుతున్నా" అని అన్నారు.

ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకున్నామని, 10 ఏళ్లలో కొంత అభివృద్ధి జరిగినా ఇంకా సాధించాల్సింది చాలా ఉందని అన్నారు. మన బతుకులు బాగుపడాలంటే పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, 999 రోజుల్లో ఉచిత బస్సు తప్ప ఏ హామీ అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హామీలు ఇచ్చి మర్చిపోయారని అన్నారు.

నిజామాబాద్ జిల్లా సమస్యలను ప్రస్తావిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాకు ఒక్క ఎకరాకైనా నీరు వచ్చిందా అని ప్రశ్నించారు. జిల్లాలో బీడీ కార్మికులు అధికంగా ఉన్నారని, వారికి పెన్షన్ పెంచుతామని బీఆర్ఎస్, కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరించాయని, కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బోధన్ ఎన్ఎస్ఎఫ్, సారంగాపూర్ షుగర్ ఫ్యాక్టరీలను మూసివేయగా తెరిపించే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదని, దీంతో కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు ప్రజలను పట్టించుకోకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని, వారికి రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

తాను ఏ తప్పు చేయకపోయినా రాజకీయ కక్షతో ఢిల్లీ తీహార్ జైల్లో వేశారని, సుప్రీంకోర్టు తనకు క్లీన్ చీట్ ఇచ్చిందని గుర్తు చేశారు. నిజామాబాద్ బిడ్డ అయిన తనను అక్రమంగా వేధించారని కన్నీళ్లు పెట్టుకున్నారు.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందే పోరాటం కోసమని, ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, అధికారంలోకి వచ్చాక ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుపేదలకు భూమి, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

తమ పార్టీ రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, తమ వద్ద పెద్ద నాయకులు లేకున్నా ప్రజల కోసం పోరాడే నాయకులు ఉన్నారని, రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సంకల్ప సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కవితకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.









Post a Comment

Previous Post Next Post