తాడ్కోల్ చౌరస్తాలో చిన్నారి మృతితో కదిలిన యంత్రాంగం...
ఇందిరాగాంధీ విగ్రహం వెనక్కి, డివైడర్ తొలగింపు - దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు
బాన్సువాడ, ఆగస్టు 29:
బాన్సువాడ పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే తాడ్కోల్ చౌరస్తా వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి విద్యార్థిని మృతి చెందిన ఘటన యావత్ పట్టణాన్ని కలచివేసింది. ఈ విషాదంతో మున్సిపల్ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది.
ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మున్సిపల్ చైర్ పర్సన్ జంగం విజయ, ఆర్డీవో రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, పట్టణ సీఐ తుల శ్రీధర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ప్రమాదానికి కారణాలుగా గుర్తించిన అంశాలు:
చౌరస్తా మలుపులో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం, రోడ్డు డివైడర్, రోడ్డు పక్కన అక్రమ షెడ్లు, తోపుడు బండ్లు, ఫ్లెక్సీ బోర్డులు వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా అడ్డుపడుతున్నాయని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా స్కూల్ వేళల్లో విద్యార్థులు రోడ్డు దాటేటప్పుడు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని తేలింది.
వెంటనే జేసీబీలతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. శనివారం నాడు ఇందిరా గాంధీ విగ్రహాన్ని వెనుకవైపునకు జరిపి ప్రతిష్టిస్తున్నారు. డివైడర్ ను తొలగించి రోడ్డును వెడల్పు చేస్తున్నారు.
చౌరస్తా వద్ద స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రాతిపదికన రహదారి భద్రతా చర్యలు చేపడతామని, పట్టణంలోని ఆక్రమణలన్నీ తొలగించి రోడ్లను వెడల్పు చేస్తామని ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు 'తెలంగాణ డైలీ న్యూస్'కు తెలిపారు.




Post a Comment