Top News

SIR Complted | ఎస్‌ఐఆర్‌ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విజయవంతంగా పూర్తి

ఎస్‌ఐఆర్‌ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ  విజయవంతంగా పూర్తి

ఓటర్ల వివరాల ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యత – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

జిల్లాలో 6.96 లక్షల మందికి 100% ఫారాల పంపిణీ పూర్తి

కామారెడ్డి: భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్‌ఐఆర్‌ కామారెడ్డి జిల్లాలో విజయవంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.

796 పోలింగ్ కేంద్రాల్లో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం

జిల్లాలోని జుక్కల్, యెల్లారెడ్డి, కామారెడ్డి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 796 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన 6,96,006 మంది ఓటర్లకు ఎన్నికల ఫారాల ముద్రణ, పంపిణీ 100 శాతం పూర్తయిందని కలెక్టర్ వెల్లడించారు. ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సమగ్రంగా నమోదు చేయడం ద్వారా ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా రూపొందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

87.87% డిజిటైజేషన్ పూర్తి

నియోజకవర్గాల వారీగా వివరాలు

👉జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం: 2,06,343 మంది ఓటర్లకు ఎన్నికల ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయింది. ఇప్పటివరకు 90.27 శాతం వివరాల డిజిటైజేషన్ పూర్తయింది.

👉యెల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం: 2,28,503 మంది ఓటర్లకు ఎన్నికల ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయింది. 90.17 శాతం వివరాల డిజిటైజేషన్ పూర్తయింది.

👉కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం: 2,61,160 మంది ఓటర్లకు ఎన్నికల ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయింది. 83.96 శాతం వివరాల డిజిటైజేషన్ పూర్తయింది.

జిల్లా స్థాయి గణాంకాలు

జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,96,006 మంది ఓటర్లు ఉండగా, అందరికీ ఎన్నికల ఫారాల ముద్రణ, పంపిణీ 100 శాతం పూర్తయింది. ఇప్పటివరకు 6,11,568 ఎన్నికల ఫారాలు, అంటే 87.87 శాతం డిజిటైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. మొత్తం 796 మంది బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి సంబంధించిన శిక్షణను పూర్తిగా పొందారు. 84,438 ధృవీకరణ కాని ఎన్నికల ఫారాలు నమోదు చేసినట్లు తెలిపారు.

మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాల గుర్తింపు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా మరణించిన ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, ఇప్పటికే మరోచోట నమోదు అయిన వారు, గైర్హాజరైన ఓటర్లు తదితర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత వర్గీకరణలను స్పష్టంగా నమోదు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ఓటర్లు తమ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం ప్రతి ఓటరు మరోసారి తమ పేరు, చిరునామా, వయస్సు, ఇతర ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు.

తప్పులుంటే వెంటనే సవరణలు చేయించుకోవాలి

తమ వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నా, పేరు లేకపోయినా లేదా ఇతర అభ్యంతరాలు ఉన్నా, నిబంధనల ప్రకారం సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి సవరణలు, అభ్యంతరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అర్హులైన ప్రతి ఓటరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, అనర్హమైన లేదా తప్పుగా నమోదైన వివరాలను నిబంధనల ప్రకారం సరిచేసే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

సిబ్బంది కృషిని అభినందించిన కలెక్టర్

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో కృషి చేసిన ఎన్నికల సిబ్బంది, బూత్ స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఓటర్ల జాబితా ఖచ్చితత్వం, పారదర్శకతను నిర్ధారించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Post a Comment

Previous Post Next Post