Top News

Street Dog Bite | దేశాయిపేటలో వీధికుక్కల కలకలం

దేశాయిపేటలో వీధికుక్కల కలకలం.. బాలుడికి తీవ్రగాయం

బాన్సువాడ రూరల్, ఆగస్టు 23: బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు మసీదు వద్దకు వెళ్లి, తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఒక్కసారిగా దూసుకొచ్చిన వీధికుక్క బాలుడిపై దాడి చేసి కరిచింది. బాలుడి కేకలు విన్న తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కను తరిమికొట్టారు. తీవ్ర గాయాలపాలైన బాలుడిని వెంటనే కుటుంబ సభ్యులు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ బాలునికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఆందోళనలో తల్లిదండ్రులు

ఇటీవల బాన్సువాడ పట్టణ కేంద్రంలోనూ వీధికుక్కలు దాడి చేసి సుమారు 20 మందికి పైగా గాయపరిచిన ఘటన ప్రజలను భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పట్టణ శివారులోని దేశాయిపేటలోనూ కుక్క కాటు ఘటన పునరావృతం కావడంతో గ్రామస్థులు, బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలను బయటకు పంపాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

స్పందించని అధికారులు

పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నది.  ఇప్పటికైనా మున్సిపల్, పంచాయతీ అధికారులు స్పందించి వీధికుక్కల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

బాన్సువాడలో ఒకరికి డెంగ్యూ

బాన్సువాడ పట్టణంలో నివసించే ఒక వ్యక్తి డెంగీ బారిన పడ్డారు.  దోమలు అధికమవడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. సదరు వ్యక్తికి ప్లేట్లెట్లు తగ్గిపోవడంతో ఆసుపత్రి లో చేర్పించారు.  అయితే టెస్టులు చేయగా డెంగీ అని తేలింది.


Post a Comment

Previous Post Next Post