ప్రపంచ ఓపెన్ తైక్వాండోలో నిజామాబాద్ క్రీడాకారుల సత్తా
11 మంది పోటీ - 12 పతకాలు, ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం
నిజామాబాద్ : హైదరాబాద్‌లో ఆగస్టు 21 నుంచి 23 వరకు జరిగిన 1వ ప్రపంచ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో నిజామాబాద్ క్రీడాకారులు సత్తా చాటారు.
ఆటోనగర్‌లోని ఎండ్యూరెన్స్ తైక్వాండో & ఫిట్‌నెస్ అకాడమీ (ETA) నుంచి 11 మంది క్రీడాకారులు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు. కయోరుగు, పూమ్సే, స్పీడ్ కిక్, స్పీడ్ పంచెస్ వంటి విభాగాల్లో పోటీపడి మొత్తం 7 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్య పతకం సాధించారు. అంతేకాకుండా బెస్ట్ పెర్ఫార్మర్స్ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా దక్కించుకున్నారు.
ముఖ్యంగా కయోరుగు విభాగంలో ETA క్రీడాకారుల దాడి నైపుణ్యం, వ్యూహాత్మక ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నాకౌట్ విజయాలతో వారు ఔరా అనిపించారు.
క్రీడాకారులకు మాస్టర్ సయ్యద్ గయాస్ శిక్షణ అందించారు. 25 ఏళ్ల అనుభవం కలిగిన ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, తైక్వాండో బ్లాక్ బెల్ట్, నేషనల్ బెస్ట్ కోచ్ మరియు రిఫరీగా సేవలందిస్తున్నారు. ఆయన క్రమశిక్షణ, ఫిట్‌నెస్, సాంకేతిక శిక్షణే ఈ విజయానికి కీలకమని నిర్వాహకులు తెలిపారు.
ఈ విజయం నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమని, యువతకు స్ఫూర్తిదాయకమని పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, క్రీడా ప్రముఖులు అభినందించారు.

Post a Comment