కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహాధర్నా - విజిలెన్స్ దాడులకు వ్యతిరేకంగా ఆందోళన
పెండింగ్ మిల్లింగ్ చార్జీల విడుదలతో పాటు పలు డిమాండ్లతో వినతి - బాన్సువాడ నుండి భారీగా తరలివచ్చిన మిల్లర్లు
3 నెలల్లోనే బియ్యం తరలింపు పూర్తి చేయాలి, కమీషన్ పెంచాలి: అసోసియేషన్
కామారెడ్డి - సెప్టెంబర్ 10 (తెలంగాణ డైలీ న్యూస్):
రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. బాన్సువాడ డివిజన్ నుండి వందలాది మంది రైస్ మిల్ యజమానులు, సిబ్బంది ర్యాలీగా తరలివచ్చి ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, కొన్ని మిల్లుల బకాయిల పేరుతో జిల్లాలోని అన్ని రైస్ మిల్లులపై విజిలెన్స్ సోదాలు నిర్వహించడం సరికాదన్నారు. బకాయిలు ఉన్న మిల్లుల నుండి మాత్రమే రికవరీ చేయాలని, అందరినీ వేధించవద్దని కోరారు.
2014 నుండి పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎంఆర్ బిల్లింగ్ విధానంతో తమపై భారం పెరిగిందని, పెరిగిన విద్యుత్ చార్జీలు, హమాలీ వేతనాలు, రవాణా, ప్యాకింగ్ ఖర్చులతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు పరిహారంగా క్వింటా బియ్యానికి రూ.100 కమీషన్ ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని 3 నెలల్లోనే గోదాములకు తరలించుకోవాలని, ప్రస్తుతం ఏడాది పాటు తీసుకోకపోవడంతో మిల్లుల వద్ద నిల్వ ఉన్న ధాన్యం వర్షాలకు తడిసి మొలకలెత్తి పాడైపోతోందని తెలిపారు.
గోదాముల వద్ద హమాలీల కొరతతో బియ్యం లారీలు వారాల తరబడి నిలిచిపోతున్నాయని, దీంతో లారీ అద్దె భారం తమపై పడుతోందని, లారీలు చేరిన వెంటనే దిగుమతి చేసుకోవాలని కోరారు. క్వాలిటీ కంట్రోల్ పేరుతో అనవసర కోతలు విధించవద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించి విజిలెన్స్ దాడులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లులను నిరవధికంగా మూసివేస్తామని హెచ్చరించారు.
Post a Comment