జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేస్తారు - జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

నిజాన్ని నిర్భయంగా రాయాలి.. నైతిక విలువలను కాపాడాలి

జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేస్తారు - జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

బాన్సువాడలో రెండు రోజుల పాటు కొనసాగిన జర్నలిస్టుల శిక్షణ తరగతులు ఘనంగా ముగింపు

బాన్సువాడ: జర్నలిస్టులు సమాజంలో నైతిక విలువలను కాపాడుకుంటూ, నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

కామారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలకు చెందిన జర్నలిస్టుల కోసం తెలంగాణ మీడియా అకాడమీ, TUWJ(I)-IJU ఆధ్వర్యంలో బాన్సువాడ SRNK డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతులు బుధవారం ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హాజరయ్యారు.

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.."జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలి. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

జిల్లాలో సుమారు 500 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేశాం. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఇలాంటి శిక్షణ ఇవ్వడం ప్రశంసనీయం. దీని వల్ల జర్నలిస్టులు క్రైమ్, సివిల్, రెవెన్యూ వంటి అంశాలపై నైపుణ్యం సాధిస్తారు. ఏఐ ద్వారా వచ్చే సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకున్న తర్వాతే వార్తలు రాయాలి, వాస్తవాలను నిర్ధారించడమే జర్నలిజం విలువను పెంచుతుంది" అని అన్నారు.

ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ మాట్లాడుతూ, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నా కొన్ని పాఠశాలలు పాటించడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్, ఉత్తర్వులు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. "ప్రభుత్వాలు ఏవైనా జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా రాయాలి. పత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు చేరే వార్తలు వాస్తవాధారంగా, సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. జర్నలిస్టులు కేవలం వార్తలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వారధులుగా ఉండాలి. సమాజం పట్ల సరైన దృక్పథం ఉండాలి. సామాజిక సమస్యలపై అవగాహన ఉంటేనే జర్నలిస్టుగా రాణిస్తారు.

జర్నలిస్టులకు సమాజం పట్ల సరైన దృక్పథం ఉండాలి. ప్రాంత నైసర్గిక స్వరూపం, సామాజిక అంశాలు, సమస్యలపై అవగాహన పెంపొందించుకోవాలి. అప్పుడే సమాజంలో మంచి జర్నలిస్టుగా రాణిస్తాడని అన్నారు. మీడియా చట్టాలు, నైతిక నియమావళి అనే అంశంపై పలు విషయాలు వివరించారు.

రాజ్యాంగంలో బంధిస్తే పత్రికా స్వేచ్ఛ కోల్పోతుందనే ముందుచూపుతో డాక్టర్ అంబేద్కర్ మీడియాను రాజ్యాంగంలో పొందుపర్చలేదని తెలిపారు. మీడియాకు ఆంక్షలు ఉన్నాయని, అనేక చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారతదేశ ప్రజలకు ఎంత స్వేచ్ఛ ఉందో.. జర్నలిస్టులకు అంత స్వేచ్ఛ ఉందని అన్నారు.

భారత రాజ్యాంగం (Indian Constitution) లోని 19.1a లో పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛ పత్రికలను ఏర్పాటు చేసుకునే, నిజాలపై నిర్భయంగా రాసే అవకాశం కల్పించిందని వివరించారు.

జర్నలిస్టులకు చట్టాలపై అవగాహన అవసరం. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం (RTI) ను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ప్రస్తుతం AI, సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జర్నలిజంలో అనేక మార్పులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా ఫ్యాక్ట్ చెకింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆధునిక సాంకేతికతను వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు వాడుకోవాలి" అని సూచించారు.

రెండు రోజుల పాటు తొమ్మిది మంది సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్లు వార్తా సేకరణ, రచన, నైతిక విలువలు, చట్టపరమైన అంశాలు, డిజిటల్ మీడియా, AI పై శిక్షణ ఇచ్చారని తెలిపారు.

ముగింపు కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీపీఆర్వో, ఎన్ వై గిరి, మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్ రావు, TUWJ-IJU జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి తోట రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పట్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బైరి సుధాకర్ గౌడ్, జిల్లా అటాక్స్ కమిటీ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.ఏ. లతీఫ్, IJU కౌన్సిల్ సభ్యులు సేపూరి వేణుగోపాల్ చారి, DMAC మెంబర్లు మొయినుద్దీన్, గంట చంద్రశేఖర్, అభిద్, కౌసర్, ప్రెస్ క్లబ్ సభ్యులు బర్ల సుధాకర్, శ్రీకాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, పోశిరాం,. నబి, ఆనంద్, గుండోబా శ్రీనివాస్, యూనుస్, సలీం, మధు, హనుమాండ్లు, కోటగిరి సతీష్, రుద్రంగి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు. శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు.









Post a Comment

Previous Post Next Post