బాన్సువాడలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా BRS, విద్యార్థుల ఆందోళన
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భారీ ఆందోళన - ఫీజు బకాయిల విడుదలకు డిమాండ్
కామారెడ్డి/బాన్సువాడ, సెప్టెంబర్ 06:కామారెడ్డి జిల్లా కేంద్రంలో, బాన్సువాడ డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనకు వ్యతిరేకంగా - మహాధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం, 1000 రోజుల దగా పాలనకు నిరసనగా బీఆర్ఎస్ ఈ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై వేలాది మంది విద్యార్థులు, బీఆర్ఎస్ శ్రేణులు "పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తొలి విడతలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీ, జాబ్ లెస్ క్యాలెండర్, రూ. 4000 నిరుద్యోగ భృతి, యూత్ కమిషన్, 25 వేల టీచర్ పోస్టుల హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గంప గోవర్ధన్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు సుమారు రూ. 10 వేల కోట్లు పెండింగ్ లో పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వక విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బాన్సువాడలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ శ్రేణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ శ్రేణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.10 వేల కోట్లు ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి తాడ్కోల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శలు:
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం బీఆర్‌ఎస్ ఎప్పటికీ పోరాడుతుందని, ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, నాయకులు మోరల్ శ్రీనివాస్ రావు, జుబేర్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.








Post a Comment