Top News

Ganesh with Helmet | హెల్మెట్ ధరించిన వినాయకుడితో రోడ్డు భద్రతపై అవగాహన

హెల్మెట్ ధరించిన వినాయకుడితో రోడ్డు భద్రతపై అవగాహన - కామారెడ్డి పోలీసుల వినూత్న ప్రయత్నం

కామారెడ్డి, సెప్టెంబర్ 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఆలోచన మేరకు పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలోని ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను వినాయక మండపంగా మార్చి, హెల్మెట్ ధరించిన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

"హెల్మెట్ ధరించండి - ప్రాణాలను కాపాడుకోండి" అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ గారు మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, హెల్మెట్ అనేది కేవలం నిబంధన కాదు, ప్రాణాలు కాపాడే రక్షణ కవచమన్నారు. పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూనే రహదారి భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు ప్రతి ప్రయాణంలో హెల్మెట్ ధరించాలని సూచించారు. మతసామరస్యంతో పండుగలు జరుపుకుని సురక్షిత కామారెడ్డిని నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, డీఎస్పీ ఎస్. మధుసూదన్, పట్టణ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, ట్రాఫిక్ ఆర్‌ఎస్ఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





Post a Comment

Previous Post Next Post