Top News

Ganja Plants | పత్తిలో గంజాయి! తుమ్మల శివారులో 400 మొక్కలు సీజ్, 12 లక్షల విలువైన పంట ధ్వంసం

పత్తిలో గంజాయి! తుమ్మల శివారులో 400 మొక్కలు సీజ్, 12 లక్షల విలువైన పంట ధ్వంసం

కామారెడ్డి జిల్లాలో భారీ గంజాయి సాగు గుట్టు రట్టు - భార్యాభర్తలతో సహా ముగ్గురు అరెస్ట్

కామారెడ్డి, సెప్టెంబర్ 17: కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మల గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి పంటను పోలీసులు భగ్నం చేశారు.

విశ్వసనీయ సమాచారం మేరకు సెప్టెంబర్ 17న గాంధారి పోలీసులు వ్యవసాయశాఖ అధికారి సమక్షంలో తనిఖీలు నిర్వహించగా, పత్తి పంటలో అంతర పంటగా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు గుర్తించారు. సుమారు 400 పచ్చి గంజాయి మొక్కలను వేర్లతో సహా తొలగించి స్వాధీనం చేసుకున్నారు. వీటి అంచనా మార్కెట్ విలువ సుమారు 12 లక్షల రూపాయలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు వివరాలను ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు వెల్లడించారు.

నిందితుల వివరాలు:

A-1 మంజ సోనుసింగ్, A-2 మంజ మద్దిబాయి ఇద్దరూ భార్యాభర్తలు. వీరు గాంధారిలో లక్ష్మికి చెందిన సర్వే నంబర్ 110/ఆ 2/2లోని 3 ఎకరాల 26 గుంటల భూమిని కౌలుకు తీసుకుని పత్తి పంటలో సుమారు 250 గంజాయి మొక్కలు నాటారు.

A-3 బస్సి జోద్రాజ్, గాంధారికి చెందిన నారాయణకు చెందిన సర్వే నంబర్ 110/అలోని 1 ఎకరం 20 గుంటల భూమిని కౌలుకు తీసుకుని 150 గంజాయి మొక్కలు సాగు చేశాడు.

ముగ్గురూ అత్యధిక డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఈ అక్రమ సాగుకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి వంటి నిషేధిత మాదకద్రవ్యాల సాగు, రవాణా, విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Post a Comment

Previous Post Next Post