నిజాంసాగర్ ఆయకట్టుకు సాగునీరు - పూజలతో కాలువకు నీటి విడుదల చేసిన ఎమ్మెల్యేలు
చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు నీరు - బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హామీ
బాన్సువాడ, సెప్టెంబర్ 2: నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తీపి కబురు. ప్రధాన కాలువకు సాగునీటిని అధికారికంగా విడుదల చేశారు.
బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువకు నీటిని విడుదల చేశారు.
అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఆయకట్టు చివరి భూముల వరకు ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు నీటిని వృధా చేయకుండా అవసరానికి తగ్గట్టు వాడుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ....
2026 వర్షాకాలంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల్లో రాష్ట్రంలో సుమారు 36 శాతం వర్షపాతం లోటు ఉన్నప్పటికీ, భగవంతుని దయతో నిజాంసాగర్ క్యాచ్‌మెంట్ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరిగాయి.
ప్రస్తుతం నిజాంసాగర్‌లో సుమారు 13.3 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల నీటి నిల్వలపై ప్రభుత్వం నిర్వహించిన సమీక్షలో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంసాగర్ కింద ఉన్న ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు నీటిని సద్వినియోగంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు.
చీఫ్ ఇంజనీర్ల కమిటీ, ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ప్రాజెక్టుల నుంచి వర్షాకాల పంటలకు నీటిని విడుదల చేస్తున్న మొదటి ప్రాజెక్టుగా నిజాంసాగర్ నిలుస్తోంది.
నిజాంసాగర్ కింద సుమారు 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని నిర్ణయించాం.
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొదట 15 రోజుల పాటు నీటిని విడుదల చేసి, అనంతరం పరిస్థితిని బట్టి వారం లేదా పది రోజులు విరామం ఇచ్చి, మళ్లీ నీటిని విడుదల చేస్తూ చివరి పంట వరకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం.
ప్రస్తుతం నాలుగు రోజులుగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లోనూ వర్షపాతం లోటు ఉండే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు ఉన్నాయి. అందువల్ల అందుబాటులో ఉన్న నీటిని ప్రతి రైతు ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాలి.
పై ఆయకట్టు రైతులు ఎక్కువ నీటిని వినియోగిస్తే కింది ఆయకట్టు రైతులకు నీరు అందదు. అప్పుడు కాలువల్లో ఎక్కువ క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి వస్తుంది. దీంతో నిజాంసాగర్ నీటి నిల్వలు త్వరగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.
కాబట్టి పై ఆయకట్టు, కింది ఆయకట్టు రైతులు పరస్పరం సహకరించుకుంటూ నీటిని పొదుపుగా వాడుకోవాలి. అందరూ సమన్వయంతో వ్యవహరిస్తే అందరి పంటలను కాపాడుకోవచ్చు.
బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాలతో పాటు నిజాంసాగర్ నీటిపై ఆధారపడిన ఆయకట్టు ప్రాంతాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతుల పంటలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైనంత మేరకు నీటి సరఫరాను కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటాం.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుని, అధికారులు–రైతులు సమన్వయంతో పనిచేస్తే ఈ వర్షాకాల పంటలను కాపాడుకోవచ్చు.
కాగా నీటి విడుదలతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం పంటలకు ఇబ్బంది లేకుండా నీటిని అందించాలని కోరుతున్నారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.







Post a Comment