కామారెడ్డి పోలీసుల ఉక్కుపాదం: పనసపండ్ల మాటున రూ.1.93 కోట్ల గంజాయి స్మగ్లింగ్ - ఇద్దరిపై పీడీ యాక్ట్
కామారెడ్డి, సెప్టెంబర్ 15: కామారెడ్డి జిల్లాలో భారీ గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులపై జిల్లా పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు.
జూన్ 20న దేవునిపల్లి పోలీసులకు అందిన పక్కా సమాచారంతో జాతీయ రహదారి 44 పై వాహన తనిఖీలు చేపట్టారు. క్యాసంపల్లి శివారులోని రాయల్ ధాబా వద్ద అనుమానాస్పదంగా ఉన్న అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనాన్ని తనిఖీ చేయగా బండారం బయటపడింది.
వాహనం పైభాగంలో పనసపండ్లు పెట్టి, వాటి కింద సంచుల్లో 387.128 కిలోల గంజాయిని దాచి తరలిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1,93,56,400. ఈ కేసులో ముగ్గురిని అప్పట్లోనే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. తాజాగా ఈ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరిపై పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పీడీ యాక్ట్ అమలు చేసిన నిందితులు:
1. రాజు @ రాజ్ కిషోర్ ప్రధాన్, కంధమాల్ జిల్లా, ఒడిశా
2. దీపక్ @ దీపక్ ప్రధాన్, కంధమాల్ జిల్లా, ఒడిశా
వీరు ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రలోని నాసిక్ కు గంజాయి తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ సందర్భంగా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ - మాదకద్రవ్యాల అక్రమ రవాణా యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కామారెడ్డి జిల్లాలో డ్రగ్ మాఫియాను ఉపేక్షించేది లేదని, గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కఠినంగా అమలు చేస్తామని హెచ్చరించారు. గంజాయికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Post a Comment