Top News

Rice Millers | ఆరు ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలి

రైస్ మిల్లర్లపై విజిలెన్స్ దాడులు ఆపాలి

బకాయిలు చెల్లించాలి... ఆరు ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలి - లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె: మిల్లర్ల హెచ్చరిక

బాన్సువాడ, సెప్టెంబర్ 11: రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులపై జరుగుతున్న విజిలెన్స్ దాడులను వెంటనే నిలిపివేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మిల్లర్ల ప్రతినిధులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

మిల్లింగ్ చేసిన బియ్యానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలతో పాటు మిల్లింగ్, హమాలీ, రవాణా చార్జీలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా మిల్లులపై విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులతో దాడులు చేయించడం సరికాదన్నారు. ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం వల్ల మిల్లర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే దాడులను నిలిపివేసి, పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయడంతో పాటు మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులను మూసివేసి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ఆరు ప్రధాన డిమాండ్లు ఇవే:

1.25 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అవుట్ టర్న్ రేషియోను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా టెస్ట్ మిల్లింగ్ ద్వారా సవరించాలి.

2.గత ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్ చార్జీలను వెంటనే చెల్లించాలి.

3. ధాన్యం అందించిన మూడు నెలల్లోపు మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ప్రభుత్వం తీసుకోవాలి.

4. ఎండాకాలం పంటలో పచ్చి బియ్యం (రా రైస్) ఇవ్వడం సాధ్యం కాదని, నూకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున బాయిల్డ్ రైస్‌ను మాత్రమే తీసుకోవాలి.

5.మిల్లింగ్ చార్జీలను క్వింటాల్‌కు రూ.100 కు పెంచాలి.

6.ఎఫ్‌సీఐ బియ్యం పాస్ చేసే సమయంలో టిప్ డ్యామేజ్ వంటి మిల్లర్ల పరిధిలో లేని నష్టాలను డ్యామేజ్ కింద పరిగణించవద్దు.

ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగులగామ వెంకన్న గుప్తా, ప్రధాన కార్యదర్శి సంతోష్ గుప్తా, జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఎర్వల కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డి, రాజేశ్వర్ గుప్తాతో పాటు బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన రైస్ మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post