Top News

SP Instuctions | నిరసనల సమయంలో సంయమనం పాటిస్తూ శాంతిభద్రతలు కాపాడాలి : జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర

నిరసనల సమయంలో సంయమనం పాటిస్తూ శాంతిభద్రతలు కాపాడాలి : జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర

ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గేమ్స్‌కు దూరంగా ఉండాలి - పోలీసు సిబ్బందికి ఎస్పీ దిశానిర్దేశం

కామారెడ్డి, సెప్టెంబర్ 12: జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి నిరసనలు, ఆందోళనల సమయంలో వ్యవహరించాల్సిన విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, హోంగార్డు స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు బందోబస్తు విధుల నిర్వహణ అత్యంత కీలకమని అన్నారు. ముఖ్యంగా నిరసనలు, ఆందోళనల సమయంలో ప్రతి పోలీసు సిబ్బంది తమ విధుల పట్ల పూర్తి అవగాహనతో, సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును గౌరవిస్తూనే, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పరిస్థితులను సమర్థవంతంగా నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. నిరసనల సమయంలో పోలీసులు పాటించాల్సిన చేయాల్సినవి - చేయకూడనివి (Do's & Don'ts) అంశాలను సిబ్బందికి సులభంగా అర్థమయ్యేలా వివరించారు.

ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో పోలీసు సిబ్బంది మరింత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మడం లేదా ప్రచారం చేయవద్దని సూచించారు.

అనంతరం సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సిబ్బంది వ్యక్తం చేసిన అంశాలపై ప్రస్తుత పరిస్థితుల్లో విశ్లేషిస్తూ, వాటి వల్ల శాఖపై పడే అనుకూల, ప్రతికూల ప్రభావాలను వివరించారు.

వ్యక్తిగత జీవితంలో కూడా జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ గేమ్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. వాటికి అలవాటు పడటం వల్ల ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలై చివరకు ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.

మన పిల్లల, కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని క్షణికమైన ఆశలకు లోనై జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే నిర్ణయాలు తీసుకోవద్దని పిలుపునిచ్చారు. స్నేహితుడు ఎవరైనా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసవుతుంటే "నాకెందుకులే" అని వదిలేయకుండా అతడిని ఆ ఊబి నుంచి బయటకు తీసుకురావాలని, అదే నిజమైన స్నేహానికి నిదర్శనమని తెలిపారు.

ప్రతి పోలీసు సిబ్బంది ప్రజలతో మర్యాదగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తూ బందోబస్తు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, రిజర్వు ఇన్స్పెక్టర్లు సంతోష్ కుమార్, నవీన్, ఆర్ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు.





Post a Comment

Previous Post Next Post