కామారెడ్డిలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత - 420 మంది పోలీసులతో బందోబస్తు
162 సీసీ కెమెరాలు, 3 డ్రోన్లతో నిఘా - ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, సెప్టెంబర్ 23: కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, సాఫీగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో నిమజ్జన బందోబస్తుపై అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఎస్పీ, శోభాయాత్ర మార్గంలో 162 సీసీ కెమెరాలు, 3 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. శోభాయాత్ర కోసం 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు.
జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ట్రాఫిక్ జంక్షన్లు, నిమజ్జన ఘాట్ల వద్ద అదనపు బలగాలను మోహరించి, అవసరమైన చోట బారికేడింగ్, ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేయనున్నట్లు తెలిపారు.
భక్తులకు ఎస్పీ సూచనలు:
- డీజేలు, సౌండ్ సిస్టమ్స్ విషయంలో శబ్ద పరిమితులను పాటించాలి
- మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనవద్దు, వాహనాలు నడపవద్దు
- ప్రమాదకర విన్యాసాలకు దూరంగా ఉండాలి, మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతపై శ్రద్ధ వహించాలి
- పిల్లలు, ఈత రాని వారు నిమజ్జన సమయంలో నీటిలోకి దిగవద్దు
- రెచ్చగొట్టే నినాదాలు, వ్యాఖ్యలు చేయకుండా ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలి
- అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలి
భక్తి మనసులో, బాధ్యత మన చేతుల్లో అంటూ, సురక్షితమైన గణేష్ నిమజ్జనానికి పోలీసులకు ప్రజలు, మండప నిర్వాహకులు సహకరించాలని ఎస్పీ రాజేష్ చంద్ర పిలుపునిచ్చారు.




Post a Comment