బాన్సువాడలో గణేష్ నిమజ్జనకు పకడ్బందీ బందోబస్తు
200 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలు, 2 డ్రోన్లతో నిఘా
డీజేలకు నో పర్మిషన్ - ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరిక
బాన్సువాడ, సెప్టెంబర్ 25:బాన్సువాడ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సాఫీగా, ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు.
బాన్సువాడ పట్టణాన్ని 3 సెక్టర్లుగా విభజించి, 10 ముఖ్య ప్రాంతాల్లో పికెట్లు, రూఫ్ టాప్ బందోబస్తు, పెట్రోలింగ్ టీమ్ లను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. శుక్రవారం ఆయన పోలీస్ అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.
భద్రతా ఏర్పాట్ల వివరాలు:
- 200 మంది పోలీసులు బందోబస్తులో
- 100 సీసీ కెమెరాలు, 2 డ్రోన్లతో నిరంతర నిఘా
- 7 సీఐల ఆధ్వర్యంలో 7 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు సిద్ధం
- ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు బారికేడింగ్
శోభాయాత్రను ఆధునిక సాంకేతికతతో పర్యవేక్షిస్తామని, ప్రజలు కూడా చూసేందుకు సీసీ కెమెరా స్క్రీన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు:
గణేష్ నిమజ్జన శోభాయాత్రలో డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. సంప్రదాయ వాయిద్యాలతో, భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నిమజ్జనం చేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, రెచ్చగొట్టే నినాదాలు చేయడం వంటి చర్యలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
"భక్తి మనసులో ఉండాలి... బాధ్యత మన చేతుల్లో ఉండాలి" అనే సందేశంతో ప్రజలు పోలీసులకు సహకరించాలని, నిమజ్జన ప్రాంతాల వద్ద పిల్లలు, ఈత రాని వారు నీటిలోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే డయల్ 100 / 112 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కల్కి చెరువు కట్ట వద్ద అన్ని సంబంధిత శాఖల సమన్వయంతో 11వ రోజు గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది.









Post a Comment