గాంధారి మండలంలో పిడుగుపాటు బీభత్సం
చేతిలోనే మొబైల్స్ పేలి స్పృహ కోల్పోయిన ఇద్దరు రైతులు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
గాంధారి : గాంధారి మండలం బొప్పాజివాడ శివారులో పిడుగుపాటు కారణంగా రైతుల చేతిలో ఉన్న సెల్ ఫోన్లు పేలిపోయి ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు.
బొప్పాజివాడకు చెందిన మేకల సూర్యకాంత్, బూర్గుల్ కు చెందిన గైని శంకర్ ఇద్దరూ బొప్పాజివాడ శివారులోని పత్తి చేనులో గుంటుక కొడుతున్నారు. వర్షం రావడంతో ఇద్దరూ గొడుగు పట్టుకుని నిలబడ్డారు. ఇంతలో వారి సమీపంలో భారీ పిడుగు పడటంతో వారి వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లు ఒకేసారి భారీ శబ్దంతో పేలిపోయాయి.
మొబైల్స్ పేలడంతో ఇద్దరు రైతులు అక్కడికక్కడే స్పృహ తప్పి కుప్పకూలిపోయారు. శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే వారిని ఎడ్ల బండిపై 2 కి.మీ దూరం తీసుకెళ్లి, అక్కడి నుంచి అంబులెన్స్ లో గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
గమనిక: వర్షం, పిడుగులు పడే సమయంలో రైతులు సెల్ ఫోన్లు వాడకూడదని, గొడుగు పట్టుకుని చెట్ల కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Post a Comment