Top News

SP's Video Conference | గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు

గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు - నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే 3 డీజేలపై కేసులు, సామగ్రి సీజ్

గణేష్ మండపాల వద్ద 24 గంటలు పోలీసు పహారా

కామారెడ్డి, సెప్టెంబర్ 15: కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్ల పనితీరు, శాంతిభద్రతలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు తీరుపై సమీక్షించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు, ఈ-సాక్ష్యా తప్పనిసరి చేయాలని, గడువులోగా ఛార్జిషీట్లు దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు.


గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక ఆదేశాలు:

ప్రతి గణేష్ మండపాన్ని పోలీస్ అధికారులు రోజూ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని, పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటల పాటు అప్రమత్తంగా గస్తీ నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ భద్రతా సూచనలు ఇవ్వాలన్నారు.

రేపటి నుంచి పలు చోట్ల నిమజ్జనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిమజ్జన ప్రాంతాలను ముందుగానే గుర్తించి బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

డీజేలపై నిషేధం:

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం గణేష్ ఉత్సవాల్లో డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో 3 డీజేలపై కేసులు నమోదు చేసి, డీజే సామగ్రితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డప్పు కళాకారులను గౌరవిస్తూ, వారి కళలను ప్రోత్సహిస్తూ సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు.


సోషల్ మీడియాపై నిఘా:

సోషల్ మీడియాలో వదంతులను నమ్మవద్దని, మత సామరస్యానికి విఘాతం కలిగించే పోస్టులు, వీడియోలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి సోషల్ మీడియాపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, అనుమానాస్పద సమాచారాన్ని ఫార్వర్డ్ చేయకుండా పోలీసుల దృష్టికి తేవాలని కోరారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాసరావు, బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి, డిసిఆర్బీ డీఎస్పీ గట్టుమల్లు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తో పాటు జిల్లాలోని ఇన్స్పెక్టర్లు, సీఐలు, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post