Action on Rice Millers | కృత్రిమ కొరత సృష్టిస్తే ఊరుకోం

కృత్రిమ కొరత సృష్టిస్తే ఊరుకోం : రైస్ మిల్లర్లకు ప్రభుత్వం వార్నింగ్

బియ్యం ధరలు అదుపులో ఉంచాలని సివిల్ సప్లై భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం

అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తప్పవు - పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్, అక్టోబర్ 28: రాష్ట్రంలో బియ్యం ధరలు అమాంతం పెరగకుండా, సామాన్యులకు అందుబాటులో ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర (IPS) ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని సివిల్ సప్లై భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ నేతృత్వంలో మిర్యాలగూడ, నిజామాబాద్, నల్గొండకు చెందిన ప్రముఖ రైస్ మిల్లర్లు, హోల్ సేల్ వ్యాపారులతో ఈ సమావేశం నిర్వహించారు. మార్కెట్లో బియ్యం కొరత లేకుండా చూడాలని, వినియోగదారులకు అందే ధరలను అదుపులో ఉంచాలని ఈ సందర్భంగా వారికి స్పష్టం చేశారు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బియ్యం నిల్వలన్నీ గత సీజన్ కు చెందినవే కాబట్టి, ధరలను అమాంతం పెంచడానికి వీల్లేదని అధికారులు వ్యాపారులకు తేల్చిచెప్పారు. కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా బియ్యాన్ని గోడాముల్లో దాచిపెట్టినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. వ్యాపారుల లాభాపేక్ష వల్ల సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎవరినీ ఉపేక్షించదని తెలిపారు.

ధరలను అదుపులో ఉంచడంతో పాటు ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించాలని మిల్లర్లకు అధికారులు సూచించారు. పరిస్థితిని బట్టి మార్కెట్లో ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు తెరిచి బియ్యం విక్రయిస్తుందని, అప్పుడు ఆ కౌంటర్లకు ఎలాంటి అంతరాయం లేకుండా బియ్యం సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

ఎప్పటికప్పుడు మార్కెట్ ను పర్యవేక్షిస్తూ, ప్రజా సంక్షేమం కోసం పౌర సరఫరాల శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. పారదర్శకతతో పాటు, సామాన్యులకు అందుబాటులో ఉండే ధరల ద్వారా ప్రజలందరికీ ఆహారం అందేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post