సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి - కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్
ప్రభుత్వ వైద్య కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయండి - జిల్లా పోలీస్ శాఖ
కామారెడ్డి, అక్టోబర్ 28: జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసోత్సవం - అక్టోబర్ 2026లో భాగంగా బుధవారం కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా పోలీస్ శాఖ, జిల్లా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (D4C) ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
'PAUSE FOR SAFETY - Pause. Think. Verify.' (ఆగండి.. ఆలోచించండి.. నిర్ధారించుకోండి) అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కామారెడ్డి డివిజన్ డీఎస్పీ మధుసూధన్, కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్, సైబర్ క్రైమ్ ఎస్ఐ నరేశ్, దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మధుసూధన్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు, నకిలీ ఉద్యోగాలు, రుణ యాప్ ల వేధింపులు, ఇతరుల పేరుతో నటిస్తూ చేసే మోసాలు, ఆన్ లైన్ షాపింగ్ మోసాలు, ఫోన్ కాల్స్, మెసేజ్ ల ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కృత్రిమ మేధస్సు (AI)తో రూపొందించే డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ ఆడియోల ద్వారా జరిగే మోసాలను నమ్మే ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని, గుర్తు తెలియని వ్యక్తులకు డబ్బులు పంపవద్దని తెలిపారు. గుర్తు తెలియని లింకులను తెరవకూడదని, ఓటీపీ, పిన్, సీవీవీ, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్ వర్డ్ లను ఎవరికీ వెల్లడించకూడదని, తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయనే సందేశాలను నమ్మవద్దని హెచ్చరించారు.
కార్యక్రమంలో విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ రకాల సైబర్ నేరాలు, నేరగాళ్లు అనుసరించే విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం అవగాహన పోస్టర్లను ప్రదర్శించారు.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని లేదా http://www.cybercrime.gov.in వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సత్వర ఫిర్యాదు ద్వారా మోసపోయిన డబ్బును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థులతో సైబర్ నేరాల నివారణ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొనగా, సుమారు 300 మంది విద్యార్థులు అవగాహన పొందారు.


Post a Comment