Blood 🩸 Donate by Police | కామారెడ్డిలో మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన

 

పోలీసు అమరవీరులకు నిజమైన నివాళులు - కామారెడ్డిలో మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన - 435 యూనిట్ల రక్తం సేకరణ

రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా నిలవండి - జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పిలుపు

కామారెడ్డి: పోలీసు అమరవీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో శనివారం కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరానికి పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు, యువత, ఆటో డ్రైవర్లు, వివిధ సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా విశేష స్పందన తెలిపారు. మొత్తం 435 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ - "సమాజ శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ప్రజల సురక్షిత భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయం. నేడు మనం సురక్షితంగా జీవిస్తున్నామంటే అది వారి త్యాగాల ఫలితమే. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నుండి 31 వరకు నిర్వహించే పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలు అమరవీరుల పట్ల కృతజ్ఞతను చాటుకునే పవిత్ర సమయం. వారి అమరత్వానికి నివాళిగా ఈ మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం ఎంతో అర్థవంతమైనది.

రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడే అత్యున్నత మానవీయ సేవ. ఎన్ని విజ్ఞాన విప్లవాలు వచ్చినా మానవ రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేం. మనం ఇచ్చే ఒక యూనిట్ రక్తం ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలి" అని పిలుపునిచ్చారు.

రక్తదానం చేసిన వారికి జిల్లా పోలీసు శాఖ, తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో హెల్మెట్లను పంపిణీ చేశారు. రక్తదానంతో పాటు హెల్మెట్ ధారణతో ప్రాణాలను కాపాడుకోవాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సంజీవ రెడ్డి, రాష్ట్ర సభ్యులు జైపాల్ రెడ్డి, తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ప్రతినిధులు, IVF సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ బాలు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, కాలేజీ యజమానులు, ప్రిన్సిపాల్స్, యువకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post