Collector | ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు పంట కుంటలు కీలకం

ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు పంట కుంటలు కీలకం 

రైతులు ఫామ్ పాండ్లు నిర్మించుకోవాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచన

కామారెడ్డి: ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో నీటి సంరక్షణకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రైతులకు సూచించారు.

శనివారం భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో రైతు సింగిని భిక్షపతి తన రెండెకరాల వ్యవసాయ భూమిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఫామ్ పాండ్ నిర్మాణ పనులను కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ వై.ఎన్. గిరి, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న కూలీలతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షపు నీటిని వృథా చేయకుండా పంట కుంటల్లో నిల్వ చేసుకోవడం ద్వారా సాగునీటి అవసరాలను కొంతవరకు తీర్చుకోవడంతోపాటు భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని తెలిపారు. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

గ్రామస్థాయిలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, వ్యవసాయ పొలాల్లో పంట కుంటలు, గ్రామాల్లో ఊటకుంటలు ఏర్పాటు చేయడంతోపాటు బోరుబావుల రీచార్జి పనులు చేపట్టాలని సూచించారు. వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగుపై రైతులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని పేర్కొన్నారు.

అనంతరం గ్రామ సహకార సంఘాన్ని సందర్శించి పంపిణీకి సిద్ధంగా ఉన్న శనగ విత్తనాలను పరిశీలించారు. రైతులకు విత్తనాల పంపిణీ, వ్యవసాయ అవసరాలకు సంబంధించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ వై గిరి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ దామోదర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, తహసీల్దార్ సునీత, ఏడీఏ అపర్ణ, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, సర్పంచ్ కోడూరి సాయ గౌడ్, ఉపసర్పంచ్ చైతన్య కొండారెడ్డి, సొసైటీ చైర్మన్ రాజగోని బాలా గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post