Dassera Celebrations | బాన్సువాడలో అంగరంగ వైభవంగా విజయదశమి వేడుకలు


బాన్సువాడలో అంగరంగ వైభవంగా విజయదశమి వేడుకలు - జనసందోహంగా మినీ స్టేడియం

పాలపిట్ట దర్శనం, జమ్మి పూజ, రావణ దహనంతో దద్దరిల్లిన బాన్సువాడ

ఎల్-నినో హెచ్చరిక - రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కీలక సూచనలు

బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే అతిపెద్ద దసరా వేడుకగా పేరుగాంచిన బాన్సువాడ విజయదశమి ఉత్సవాలు ఈసారి మరింత వైభవంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పట్టణం మొత్తం పండుగ శోభతో కళకళలాడింది.

ఉదయం నుంచే పండుగ సందడి

మంగళవారం తెల్లవారుజాము నుంచే ప్రజలు తలంటు స్నానాలు ఆచరించి, కొత్త వస్త్రాలు ధరించి ఇళ్లలో ప్రత్యేక పూజలు చేశారు. యువత, పెద్దలు జమ్మి చెట్టు వద్దకు వెళ్లి జమ్మి ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు పంచుకున్నారు. ఆయుధ పూజలు, వాహన పూజలు, వ్యాపార సముదాయాల్లో లక్ష్మీ పూజలు ఘనంగా నిర్వహించారు.

విజయదశమి నాడు పాలపిట్టను చూడడం శుభప్రదంగా భావిస్తారు. ఈ ఏడాది పాలపిట్టల సంఖ్య తగ్గిపోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేయగా, ఎమ్మెల్యే స్వయంగా అరగంట పాటు వెతికి పాలపిట్టను దర్శించుకోవడం విశేషం.

మినీ స్టేడియంలో హైలైట్ - రావణ దహనం:

సాయంత్రం 6 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం జనసందోహంగా మారింది. దాదాపు 35 అడుగుల ఎత్తు గల రావణాసురుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఆయన ఆధ్వర్యంలో వివిధ రకాల కాల్పుల టపాసులు, చిచ్చుబుడ్లు, ఆకాశంలో రంగుల కాంతులు విరజిమ్మేలా చేశారు.

సరిగ్గా 7.30 గంటలకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రావణ విగ్రహానికి నిప్పు అంటించగానే ఒక్కసారిగా మైదానం జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లింది. భారీ అగ్నిజ్వాలల మధ్య రావణుడు దహనమవుతుంటే ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే పోచారం స్పీచ్ హైలైట్స్:

వేదికపై నుంచి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన ప్రసంగం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టింది.

1. పండుగ తత్వం: ఈ పండుగ చెడు చేసే వ్యక్తులను శిక్షించి, మంచి చేసే వారిని రక్షించే పండుగ. చెడుపై మంచి గెలిచిన రోజు. మనలోని అహంకారాన్ని వదిలేయాలి.

2. వాతావరణ హెచ్చరిక - రైతులకు అలర్ట్: ఇప్పటి వరకు సుభిక్షంగా ఉన్నాం. ఎన్నడూ లేనంత పంటలు పండాయి. కానీ 1875లో వచ్చిన కరువు వల్ల 5 కోట్ల మంది చనిపోయారు. ప్రస్తుతం అలాగే ఎల్-నినో వస్తోంది. వాతావరణం మారుతోంది. అందుకే రైతులు జాగ్రత్తగా ఉండాలి.

3. రెండో పంటపై కీలక సూచన: నీటిని పొదుపుగా వాడుకోవాలి. రెండో పంట విషయంలో రైతులు బాగా ఆలోచించాలి. వరి వేసే బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలి. బోర్లలో నీళ్లు ఉన్నాయా లేదా చూసుకోవాలి. కరెంట్ కోతలు ఉంటాయి. అవసరాన్ని బట్టి పంటలు వేసుకోవాలి. ఇబ్బంది వచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

4. నిజాంసాగర్ పై రాజకీయాలు వద్దు: అధికారికంగా నీరు వదిలిన ప్రాజెక్టు నిజాంసాగర్, ఇది వర్షాధార ప్రాజెక్టు. దీనిపై కొందరు రాజకీయాలు చేస్తున్నారు. నీటి విషయంలో రాజకీయం తగదు.

5. భావోద్వేగ భరోసా: బాన్సువాడ నియోజకవర్గాన్ని కాపాడే బాధ్యత నాపై ఉంది. ఈ నియోజకవర్గం మొత్తం నా కుటుంబం. మీరందరూ నా ఆప్తులు. ప్రభుత్వం అండగా ఉంటుంది, అన్ని విధాలుగా సహకరిస్తాం.

అనంతరం ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ అలాయ్ బలాయ్ చెప్పుకున్నారు.

ఈ కార్యక్రమంలో అగ్రో మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ, అడిషనల్ డీ జీ పీ సుదర్శన్,పోచారం సురేందర్ రెడ్డి, మాజీ డీ సీ సీ బీ చైర్మెన్ భాస్కర్ రెడ్డి, డీ సీ హెచ్ ఓ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్,మాజీ మున్సిపల్ చైర్మెన్ జంగం గంగాధర్,, సొసైటీ అధ్యక్షులు ఏర్వాల కృష్ణ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లూ, కాసుల రోహిత్,హకీమ్,నర్సుగొండ, వాoకర్ రమేష్, గౌస్, పరిగె వెంకట్ రామ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ మండలాల నాయకులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.


Post a Comment

Previous Post Next Post