Dist Marketing Officer | లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు - హెచ్చరిక

వ్యవసాయ ఉత్పత్తులపై మార్కెట్ ఫీజు వ్యాపారులే చెల్లించాలి - రైతుల నుంచి వసూలు చేయొద్దు 

లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు - హెచ్చరిక

కామారెడ్డి జిల్లాలోని 10 మార్కెట్ కమిటీల పరిధిలో ఫీజు తప్పనిసరి : జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య

కామారెడ్డి, అక్టోబర్ 27:  కామారెడ్డి జిల్లాలోని పది వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో ఎక్కడైనా విక్రయించుకోవచ్చని, మార్కెట్ ఫీజు చెల్లించాల్సిన బాధ్యత పూర్తిగా కొనుగోలు చేసే వ్యాపారులదేనని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో ఇతర రాష్ట్రాల్లో దిగుబడులు తగ్గడంతో తెలంగాణ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనీస మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలు వస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల వ్యాపారులు జిల్లాకు వచ్చి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

నిబంధనల ప్రకారం కొనుగోలు విలువపై 1% మార్కెట్ ఫీజును వ్యాపారులే సంబంధిత మార్కెట్ కమిటీలకు చెల్లించాలని పేర్కొన్నారు. జిల్లాలోని కామారెడ్డి, భిక్కనూరు, గాంధారి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, పిట్లం, బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, మద్నూర్ మార్కెట్ కమిటీల పరిధిలో ఇది వర్తిస్తుందన్నారు.

కొందరు మధ్యవర్తులు, దళారులు రైతులకు తప్పుడు సమాచారం ఇస్తూ, కనీస మద్దతు ధర ప్రకారమే ఫీజు కడతామని తనిఖీ కేంద్రాల వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగడం సరికాదన్నారు. రైతుల నుంచి మార్కెట్ ఫీజు వసూలు చేయరని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని సూచించారు.

లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తున్న మధ్యవర్తులు తప్పనిసరిగా మార్కెటింగ్ శాఖ లేదా మార్కెట్ కమిటీల నుంచి లైసెన్సులు పొందాలని, నిబంధనలు పాటించని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు దళారుల అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని, పారదర్శక లావాదేవీలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Previous Post Next Post