Minister Seethakka | బాన్సువాడ అభివృద్ధికి పోచారం తపన అభినందనీయం

 

బాన్సువాడ అభివృద్ధికి పోచారం తపన అభినందనీయం

రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు: మంత్రి సీతక్క

మహిళల ఆర్థిక స్వావలంబన, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట - మంత్రి సీతక్క

బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. అనసూయ సీతక్క మంగళవారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాన్సువాడకు చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్వాగతం పలికారు.

పర్యటనలో భాగంగా కొయ్యగుట్ట తాండాలో నూతన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బాన్సువాడ పట్టణంలోని 3వ వార్డులో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. తదుపరి బోర్లం గ్రామంలో నూతన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం:

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని, కుటుంబాలు బాగుంటే వ్యవసాయం సహా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నామన్నారు.

మహిళా సంఘాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ఆర్టీసీ బస్సుల నిర్వహణ ద్వారా వచ్చే అద్దె ఆదాయాన్ని మండల సమాఖ్య ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందిరమ్మ మహిళా క్యాంటీన్ల ఏర్పాటుతో మహిళలకు ఉపాధి కల్పిస్తూ ప్రజలకు తక్కువ ధరలో భోజనం అందించడమే లక్ష్యమన్నారు.

ఆర్థిక భద్రత, ఇళ్ల నిర్మాణం:

మహిళా సంఘ సభ్యులు రుణాలు తీసుకున్నప్పుడు అనుకోని పరిస్థితులు ఎదురైతే నిబంధనల ప్రకారం రుణ భారం తగ్గించడం, బీమా సదుపాయం కల్పించడం ద్వారా కుటుంబాలకు భరోసా ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పేదలకు సొంత ఇళ్లు కల్పించి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు.

గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి:

నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. మట్టి రహదారుల అభివృద్ధి, సోలార్ ప్లాంట్లలో మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు, సోలార్ విద్యుత్, మురుగు కాలువల నిర్మాణం, చెరువుల్లో గడ్డి పెంపకం ద్వారా మహిళా సంఘాలకు ఆదాయ మార్గాలు కల్పించే అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, మహిళల స్వావలంబన, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

మహిళలు చైతన్యవంతులు కావాలి 

నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయన తపన అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. "రాష్ట్రవ్యాప్తంగా రూ. 10 లక్షల వ్యయంతో దాదాపు 8 వేల భవనాలను నిర్మిస్తున్నాం. కొయ్యగుట్టలో నిర్మించిన భవనం చూడటానికి ఫంక్షన్ హాల్‌లా ఎంతో అద్భుతంగా ఉంది. భవిష్యత్తులో శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం" అని హామీ ఇచ్చారు.

మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో చేరి ఆర్థిక పరిపుష్టి సాధించాలని పిలుపునిచ్చారు. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి మోసపోవద్దని, ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంఘ సభ్యులకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తోందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో చైతన్యవంతులు కావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధి యే తన ధ్యేయం అని, అన్ని రంగాల్లో నియోజకవర్గం అభివృద్ధి చెందిందని అన్నారు.  ఇంకా అనేక పనులు చేయాల్సి ఉందన్నారు.  కోయగుట్ట లో మహిళా సంఘం భవనం నిర్మించడంతో ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు.

హాజరైన ప్రముఖులు

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ బాలరాజు, వైస్ చైర్మన్ రేష్మ బేగం ఏజాజ్, కౌన్సిలర్లు హకీం, ఖాళీక్,నాయకులు మహ్మద్ ఏజాజ్, మహ్మద్ గౌస్, పిట్ల శ్రీధర్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ముందస్తు ముందస్తు అరెస్టులు: మంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులతో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

బోర్లంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క 



Post a Comment

Previous Post Next Post