ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి బాలికలకు ఇస్రో సందర్శన అవకాశం
పోటీ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థినులకు శ్రీహరికోట పర్యటన
బాన్సువాడలో విద్యార్థినులతో ఆర్డీఓ, ఎంఈఓ ముఖాముఖి
బాన్సువాడ, అక్టోబర్ 31: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి బాలికలకు ఇస్రో సందర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించే పోటీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థినులతో బాన్సువాడ ఆర్డీఓ, ఎంఈఓ ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచనల మేరకు, సైన్స్ అధికారి ఆధ్వర్యంలో 10వ తరగతి బాలికలకు ఇస్రో సందర్శన కోసం పోటీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఎంపిక చేసి శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రానికి తీసుకెళ్తారని వివరించారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల బాలికల్లో ఆసక్తిని పెంచడం, వారిని ప్రోత్సహించి ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ప్రతిభ కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం, ఎం ఈ ఓ నాగేశ్వర్ రావు, పి ఆర్ టి యు జిల్లా నేత కుషాల్ తదితరులు పాల్గొన్నారు.



Post a Comment