Elnino Effect | బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు - కలెక్టర్ హెచ్చరిక

ఎల్ నినో ప్రభావంపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రత్యేక సమీక్ష

నిత్యావసర సరుకుల నిల్వలు అందుబాటులో ఉంచాలని వ్యాపారులకు ఆదేశం

బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు - కలెక్టర్ హెచ్చరిక

కామారెడ్డి, అక్టోబర్ 30: ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నిత్యావసర సరుకుల లభ్యత, పప్పుధాన్యాల నిల్వలు, మార్కెట్ ధరలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులు, వ్యాపారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో భవిష్యత్తులో నిత్యావసర సరుకుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రజలకు సరుకులు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మార్కెట్ లో డిమాండ్ కు అనుగుణంగా వ్యాపారులు కనీసం 30 నుంచి 45 రోజుల పాటు సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. నిత్యావసర సరుకుల ధరలను కృత్రిమంగా పెంచడం, అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో నిత్యావసర సరుకుల లభ్యత, ధరలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, మార్కెట్లలో తనిఖీలు నిర్వహిస్తూ నిల్వల వివరాలు, రిజిస్టర్లు, కొనుగోలు, విక్రయ బిల్లులను పరిశీలించాలని సూచించారు.

ప్రజలు నిత్యావసర సరుకుల విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అనవసరంగా అధిక మొత్తంలో సరుకులు కొనుగోలు చేయవద్దని కలెక్టర్ సూచించారు. మార్కెట్ లో సరఫరా, ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు, స్థానిక వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post