కామారెడ్డి రైల్వే స్టేషన్ లో 18 కిలోల గంజాయి పట్టివేత
రూ.9 లక్షల విలువైన సరుకు స్వాధీనం - మధ్యప్రదేశ్ వ్యక్తి అరెస్ట్
కామారెడ్డి, అక్టోబర్ 10:
కామారెడ్డి రైల్వే స్టేషన్ లో ఎక్సైజ్ శాఖ జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 18 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.9 లక్షలు.
దసరా పండుగ నేపథ్యంలో అక్రమ మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నాగవల్లి ఎక్స్ ప్రెస్ రైలులో గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీనివాసులు నేతృత్వంలో కానిస్టేబుళ్లు అమృత్ రెడ్డి, శిరీష, రాజు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆర్పీఎఫ్ సిబ్బంది సహకరించారు.
అనుమానాస్పదంగా కనిపించి పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని తనిఖీ చేయగా 18 కిలోల గంజాయి లభించింది.
నిందితుడిని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన అశోక్ (26) గా గుర్తించారు. ఒడిశాలోని టిట్లాగఢ్ నుంచి నాగవల్లి ఎక్స్ ప్రెస్ లో గంజాయిని తీసుకుని సోలాపూర్ కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.
అక్రమ మాదకద్రవ్యాలపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 2523కు కాల్ చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు. పండుగ సమయంలో అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.



Post a Comment