బాన్సువాడ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో రూ.1.40 కోట్లతో కళ్యాణ వేదిక ప్రారంభం - ఎమ్మెల్యే పోచారం
75 ఇళ్లకు తాళం వేసిన వారికి షాక్ - అర్హులకు పంచుతా: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్
ఎల్ నినోతో దేశమంతా కరువు - 15 లక్షల మంది చనిపోతారని సైంటిస్టుల హెచ్చరిక: పోచారం
బాన్సువాడ, అక్టోబర్ 12:
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో రూ.1.40 కోట్ల వ్యయంతో నిర్మించిన సాంస్కృతిక కళ్యాణ వేదిక (ఫంక్షన్ హాల్) ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం సాయంత్రం ఘనంగా ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...మధ్యతరగతి, పేద కుటుంబాలకు పెళ్లిళ్ల ఖర్చులు భారంగా మారాయని, అందుకే నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 150 ఫంక్షన్ హాల్స్ నిర్మించానని తెలిపారు. అన్ని కుల సంఘాలకు అవసరమైన చోట హాల్స్ ఇచ్చామన్నారు. అప్పు చేయకుండా ఫంక్షన్ హాల్స్ కోసమే వంద కోట్లు ఖర్చు చేశామని, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి నిధులు ఫంక్షన్ హాల్స్ కే సరిపోతున్నాయన్నారు.
ఈ కొత్త కళ్యాణ వేదికను 10 మందితో కమిటీ వేసుకుని నిర్వహించుకోవాలని, అందులో నలుగురు మహిళలు ఉండాలని సూచించారు. ఒక వాచ్ మెన్ ను పెట్టుకుని శుభ్రంగా ఉంచుకోవాలని, ఫంక్షన్ కు రూ.5 వేలు లేదా 6 వేలుగా మీరే ఫిక్స్ చేసుకోండని చెప్పారు. కాలనీకి 500 కుర్చీలు, 1500 మందికి వంట పాత్రలు, మైక్ సిస్టం కోసం మరో రూ.3 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
డబుల్ బెడ్ రూమ్ కాలనీలో మంచినీటి వసతి బాగుందని, 5వ తరగతి వరకు ప్రభుత్వ స్కూల్ ఇక్కడే ఏర్పాటు చేస్తానని, 5 నుంచి 12వ తరగతి వరకు స్కూల్ ఇప్పటికే కట్టించామని చెప్పారు. రుద్రూర్ లో 400 మంది విద్యార్థులతో నర్సింగ్ కాలేజీ, ఆహార సాంకేతిక కళాశాల ఏర్పాటు చేశామని, ఇవన్నీ ప్రజల కోసమేనని అన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కీలక ప్రకటన:
నియోజకవర్గంలో 69 వేల కుటుంబాలు ఉంటే 23 వేల మందికి ఇళ్లు లేవని, ఇప్పటికే 16 వేల ఇళ్లు కట్టించామని తెలిపారు. 11 వేల ఇళ్లు మంజూరు కాగా కట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో తన పరిచయస్తుడైన గౌరీశంకర్ తో కట్టించానని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఇలా కట్టలేదన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా కిరాయి ఇంట్లో ఉండకూడదనేదే తన సంకల్పం అన్నారు.
తహసీల్దార్ నివేదిక ప్రకారం ఈ కాలనీలో 22 ఇళ్లు కిరాయికి ఇచ్చారని, ముగ్గురు అమ్మేశారని, 75 మంది ఇచ్చినప్పటి నుంచి తాళం కూడా తీయలేదని, 106 ఇళ్లు ఖాళీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా తాళం వేసి తుప్పు పట్టిస్తున్న 75 ఇళ్లను తొలగించి అర్హులైన పేదలకు పంచుతామని, స్థలం లేని వారికి 75 గజాల చొప్పున 100 మందికి ఇస్తామని, హిందూ, ముస్లిం, మైనారిటీ అందరికీ పార్టీలకు అతీతంగా స్వయంగా తిరిగి ఎంక్వైరీ చేసి ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పి లబ్ధి పొందాలని చూస్తే ఊరుకోనని హెచ్చరించారు.
ఎల్ నినోపై హెచ్చరిక:
దేశమంతా కరువు ఉండగా బాన్సువాడలో మాత్రం కరువు లేదని, 150 ఏళ్ల క్రితం వచ్చిన ఎల్ నినో మళ్లీ వస్తోందని, దీని ప్రభావంతో తెలంగాణలో 15 లక్షల మంది చనిపోతారని సైంటిస్టులు చెబుతున్నారని, అందుకే రూపాయి రూపాయి జాగ్రత్తగా వాడుకోవాలని, నిజాంసాగర్ కింద పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ... బయట ఫంక్షన్ హాల్ కిరాయి రూ.50 వేల నుంచి 60 వేలు తీసుకుంటున్న తరుణంలో పేదలకు ఈ హాల్ ఎంతో ఉపయోగకరమన్నారు. కాలనీలో డ్రైనేజీపై జాలీలు ఎత్తుకెళ్తున్నారని, సీసీ కెమెరాలు, ఆసుపత్రి, స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, వైస్ చైర్మన్ ఏజాజ్, నార్ల సురేష్, అబ్దుల్ వహాబ్, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, తహసీల్దార్, నార్ల రవీందర్, కౌన్సిలర్లు శ్రీకాంత్, మహేష్, భాస్కర్ రెడ్డి, హకీం, గౌస్, అంజగౌడ్, రాజు, లింగం, ముజ్జు, నర్సన్న తదితరులు పాల్గొన్నారు.














Post a Comment