MP Arvind | రష్యా ఆర్మీలో చిక్కుకున్న 16 మంది తెలంగాణ యువకులు

రష్యా ఆర్మీలో చిక్కుకున్న 16 మంది తెలంగాణ యువకులు - వారిని రక్షించాలని ఎంపీ అర్వింద్ విన్నపం 

ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన నలుగురు - బాన్సువాడ యువకుడు అఫ్జల్ ఖాన్ ఫ్రంట్ లైన్ లో మృతి?

ఇండియన్ ఎంబసితో నిరంతరం టచ్ లో ఎంపీ కార్యాలయ సిబ్బంది 

నిజామాబాద్, అక్టోబర్ 12:

తెలంగాణకు చెందిన 16 మంది యువకులు రష్యా ఆర్మీలో చిక్కుకున్న వ్యవహారం సంచలనంగా మారింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విదేశాంగ మంత్రి డా.ఎస్.జైశంకర్ కు సెప్టెంబర్ 29న రాసిన లేఖ లో కోరారు.

ఏజెంట్ల మోసం:

ఎంపీ లేఖ ప్రకారం వీరందరూ ఉపాధి కోసం రష్యా వెళ్లారు. కుకింగ్, క్లీనింగ్, సపోర్ట్ వర్క్ పేరుతో ఆకర్షణీయ జీతాల ఆశ చూపి ఏజెంట్లు తీసుకెళ్లి, అక్కడ ఆర్మీ ట్రైనింగ్ క్యాంపుల్లో బలవంతంగా మిలిటరీ శిక్షణ ఇస్తున్నారని కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తిండి లేదు, నిద్ర లేదు, దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఫ్రంట్ లైన్ కు పంపుతారేమోనని భయపడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. కాగా బీహార్ కు చెందిన గౌరవ్ అనే ఏజెంట్ ను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సమాచారం.

ఎంపీ లేఖలో 16 మంది జాబితా:

1. దోమకొండ సురేష్

2. గడ్డం శేఖర్

3. కోడి గోవింద

4. దోర గొల్ల బాలయ్య

5. గొరువంతుల లింబాద్రి

6. కౌడ రాజశేఖర్

7. వరంగంటి కార్తీక్

8. కరిసినపు నాగార్జున

9. రెబ్బా భరత్

10. కస్తూరి తిరుపతి

11. సంతపురి రాజు

12. చెక్రాల చిన్న వెంకట్

13. భూక్యా రవీందర్ - ఉమ్మడి నిజామాబాద్

14. మేగావత్ ప్రకాష్ - ఉమ్మడి నిజామాబాద్

15. సిర్షు అశోక్ - ఉమ్మడి నిజామాబాద్

16. మహమ్మద్ అఫ్జల్ ఖాన్ - బాన్సువాడ

వీరిలో చివరి నలుగురు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు. అందులో బాన్సువాడకు చెందిన అఫ్జల్ ఖాన్ ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ దగ్గర మృతి చెందాడన్న వార్త కుటుంబాల్లో కలకలం రేపుతోంది. ఈ విషయమై ఇండియన్ ఎంబసితో ఎంపీ అరవింద్ కార్యాలయం సిబ్బంది టచ్ లో ఉన్నారు. అయితే సాయంత్రం వరకు ఆఫ్జల్ విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు.

మరోవైపు వీరిని వెంటనే సురక్షితంగా భారత్ కు రప్పించేందుకు మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని ఆదేశించాలని, MADAD పోర్టల్ లో నమోదైన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ అర్వింద్ విదేశాంగ మంత్రిని కోరారు.

ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని, తమ పిల్లలను త్వరగా ఇండియాకు తీసుకురావాలని బాధిత కుటుంబాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా, రష్యా దేశం యుద్ధంలో తమ ఆర్మీ చనిపోయినా అధికారికంగా వెల్లడించదని, ఇండియన్స్ గురించి అస్సలు వెల్లడించే అవకాశం లేదని విదేశీ నిపుణులు పేర్కొన్నారు.




Post a Comment

Previous Post Next Post