చివరి ఆయకట్టు రైతులకు ఊరట - 25వ నంబర్ కెనాల్ కు నీరు విడుదల చేయించిన ఎమ్మెల్యే పోచారం
నాలుగు గ్రామాల పంటలు కాపాడిన పోచారం - కొల్లూరు, నాగారం, దామరంచ, అన్నారంకు చేరిన నిజాంసాగర్ నీరు
రైతుల వినతికి సత్వర స్పందన - కెనాల్ వ్యర్థాలు తొలగించి రెండు రోజులు నీటి విడుదలకు ఆదేశం
బాన్సువాడ, అక్టోబర్ 5:నిజాంసాగర్ 25వ నంబర్ కెనాల్ చివరి ఆయకట్టు రైతుల సమస్యను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే పరిష్కరించారు.
25వ నంబర్ కెనాల్ ద్వారా చివరి ఆయకట్టులోని కొల్లూరు, నాగారం, దామరంచ, అన్నారం గ్రామాల రైతుల పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
రైతుల సమస్యను తెలుసుకున్న పోచారం వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి, కెనాల్ లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టి, వ్యర్థాలను తొలగించి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకున్నారు.
దీంతో ఆయా గ్రామాల రైతుల పొలాలకు సాగునీరు చేరడంతో చివరి దశలో ఉన్న పంటలకు ఎంతో మేలు జరిగింది. సాగునీరు అందడంతో ఆనందం వ్యక్తం చేసిన రైతులు, తమ సమస్యను వెంటనే పరిష్కరించి పంటలను కాపాడినందుకు పోచారం నకు కృతజ్ఞతలు తెలిపారు.
అంతేకాకుండా, చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా మరో రెండు రోజుల పాటు నిజాంసాగర్ నుంచి కెనాల్ కు నీటిని కొనసాగించాలని రైతుల అభ్యర్థన మేరకు పోచారం గారు అధికారులకు సూచించారు.
"చివరి ఆయకట్టు రైతు పొలానికి కూడా నీరు అందాలి.. ప్రతి ఎకరం పచ్చగా ఉండాలి" అనే లక్ష్యంతో పోచారం గారు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయా గ్రామాల రైతులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.





Post a Comment