బూతులు తిట్టాడని వ్యక్తిని హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు - నిజామాబాద్ సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు
నిజామాబాద్, అక్టోబర్ 28: బూతులు తిట్టాడన్న కోపంతో ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులో ముద్దాయి బైరి నర్సాగౌడ్ కు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జి.వి.ఎన్. భారత లక్ష్మీ బుధవారం తీర్పు చెప్పారు. దీనితో పాటు రూ.5,000 జరిమానా, జరిమానా చెల్లించని యెడల అదనంగా 6 నెలల జైలు శిక్ష విధించారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం:
బాధితుడు తాటిపాముల శివప్రసాద్ గౌడ్, నిందితుడు బైరి నర్సాగౌడ్ ఇద్దరూ నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేట మల్కాపూర్ గ్రామ వాస్తవ్యులు. 2024 జూన్ 06న ఉదయం 6 గంటలకు శివప్రసాద్ దైవ దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యలో నర్సాగౌడ్ ఎదురుపడ్డాడు. తనను ఉద్దేశించి శివప్రసాద్ బూతు మాటలు తిట్టాడని కోపంతో దగ్గరలో ఉన్న కట్టెతో తలపై కొట్టి గాయపరిచాడు.
అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ కోపంతో శివప్రసాద్ ఇంటికి వెళ్లి వెంట తెచ్చుకున్న కట్టెతో బలంగా తలపై, ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన శివప్రసాద్ ను కుటుంబ సభ్యులు నిజామాబాద్ లోని ప్రగతి ఆసుపత్రిలో, అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లడంతో బతికే అవకాశాలు లేవని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లగా అక్కడే మరణించాడు. పోలీసులు వైద్యులచే పోస్ట్ మార్టం నిర్వహించారు.
సమగ్ర విచారణ అనంతరం పోలీసులు ఛార్జ్ షీట్ ను కోర్టులో సమర్పించారు. ఈ కేసులో 21 మంది సాక్షుల వాంగ్మూలాలు, 19 ధ్రువీకరించిన పత్రాలు, ఒక వస్తుగత సాక్ష్యాన్ని కోర్టు పరిశీలించింది. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలు విన్న తర్వాత నిందితుడిపై హత్య నేరం రుజువైనట్లు నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.
నేరస్తుడికి శిక్ష పడేలా కృషి చేసిన ఇన్వెస్టిగేషన్ అధికారులు జె. రామారావు ఎస్ఐ, జి. మహేష్ ఎస్ఐ, ఎస్. సతీష్ సీఐ, ఎన్. సురేష్ కుమార్ సీఐ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. రాజేశ్వర్ రెడ్డి, బ్రీఫింగ్ ఆఫీసర్ సి.హెచ్. శ్రీనివాస్ సీఐ, నిజామాబాద్ రూరల్ పీఎస్, కోర్టు లైజన్ ఆఫీసర్ టి. గోవింద్ ఎస్ఐపి, కోర్టు సీఎంఎస్ మరియు సీడీఓ లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అభినందించారు.

Post a Comment