Welcome Party | విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదవాలి : ప్రిన్సిపాల్ గంగారాం

విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదవాలి : ప్రిన్సిపాల్ గంగారాం 

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ వెల్కమ్

గాంధారి, అక్టోబర్ 28: ప్రభుత్వ జూనియర్ కళాశాల గాంధారిలో బుధవారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఘనంగా స్వాగత కార్యక్రమం నిర్వహించారు.

కళాశాల ప్రాంగణంలో సందడి నెలకొనగా, విద్యార్థులు ఆటపాటలు, నృత్యాలతో తమ ప్రతిభను చాటుతూ అందరినీ అలరించారు. ఉత్సాహభరిత వాతావరణంలో వెల్కమ్ పార్టీ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం మాట్లాడుతూ, విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. విద్యార్థి దశ ఎంతో విలువైనదని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడికను అలవర్చుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.

ఈ స్వాగత కార్యక్రమం ప్రథమ సంవత్సర విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపగా, సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించేందుకు దోహదపడింది.

కార్యక్రమంలో లెక్చరర్లు వెంకటస్వామి, రాజగోపాల్, లక్ష్మణ్, రమేష్, శ్రీధర్, జెట్టి విజయకుమార్, సంభాజీ, నాన్ టీచింగ్ సిబ్బంది ఆరిఫ్, రాము, రియాజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.







Post a Comment

Previous Post Next Post