బోధన్ డివిజన్ పోలీసులతో నేరాల నియంత్రణపై సమీక్ష
దేవి నవరాత్రులకు పటిష్ట బందోబస్తు: సీపీ సాయి చైతన్య
నిజామాబాద్, అక్టోబర్ 14: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పోలీసు అధికారులతో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పురోగతిపై పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సమీక్ష సమావేశం నిర్వహించారు.
వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతకుంట వృద్ధాశ్రమంలో జరిగిన ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, SHOలు, SIలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు:
- దేవి నవరాత్రుల పండుగ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి, 24/7 వాహన తనిఖీలు చేపట్టాలి.
- డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దాడులు కొనసాగించాలి, అక్రమ రవాణాదారులపై PD యాక్ట్ నమోదు చేయాలి.
- సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- హత్య, హత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారాల కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరిత న్యాయం అందించాలి.
- రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయిల్‌పై ఉన్న వారిపై నిరంతర నిఘా, రాత్రి పహారాను బలోపేతం చేయాలి.
- మహిళల భద్రతకు ప్రాధాన్యత - షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ బృందాలు విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో గట్టి నిఘా ఉంచాలి.
- రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి సైన్ బోర్డులు, లింక్ రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి.
- పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి, సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలి.
- డయల్ 112 గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలి.
శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని సీపీ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు, ఇన్‌స్పెక్టర్ ఆర్. అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment