ఏప్రిల్ 1, 2027 నుంచి రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు - ఆర్బీఐ సంచలన నిర్ణయం
సైజు మాత్రం సేమ్ - ఏటీఎంలకు మార్పుల అవసరం లేదు
రూ.1000 ప్లాస్టిక్ నోట్లపై వస్తున్న వార్తలు ఫేక్ అన్న పీఐబీ
తెలంగాణ డైలీ న్యూస్ డెస్క్/న్యూఢిల్లీ: భారతీయ కరెన్సీ వ్యవస్థలో మరో విప్లవాత్మక మార్పునకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) శ్రీకారం చుడుతోంది. త్వరలోనే ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను చలామణిలోకి తీసుకురానుంది.
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన ఏప్రిల్ 1, 2027 నుంచి రూ.10, రూ.20 విలువ కలిగిన ప్లాస్టిక్ నోట్లను పైలట్ ప్రాజెక్టు కింద విడుదల చేయాలని ఆర్బీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఈ కొత్త ప్లాస్టిక్ నోట్ల సైజులు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కాగితపు నోట్ల పరిమాణంలోనే ఉంటాయని సమాచారం.
సాధారణంగా నోట్ల సైజు మారితే ఏటీఎం మెషిన్లలో మార్పులు చేయాల్సి వస్తుంది. దీనికి బ్యాంకులు వందల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. గతంలో డీమోనిటైజేషన్ సమయంలో ఈ భారం పడింది. ఇప్పుడు సైజు మార్చకపోవడం వల్ల ఏటీఎంల రీకాన్ఫిగరేషన్ ఖర్చు తప్పుతుంది.
రూ.10, రూ.20 నోట్లు నిత్యం లక్షలాది చేతులు మారుతుండటంతో త్వరగా చిరిగిపోవడం, మురికిపట్టడం జరుగుతోంది. "విదేశాల్లో ప్లాస్టిక్ నోట్లు 30 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటున్నాయి. చిన్న నోట్లకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది" అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఆర్బీఐ అనుబంధ సంస్థ 'భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్' గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది.
మొదటి విడతలో ప్రయోగాత్మకంగా 200 కోట్ల ప్లాస్టిక్ నోట్లను ప్రింట్ చేయనున్నారు. ఇందులో 100 కోట్ల రూ.10 నోట్లు, 100 కోట్ల రూ.20 నోట్లు ఉంటాయి. వాతావరణ పరిస్థితులు, ప్రజల వినియోగం, మన్నికను పరిశీలించిన తర్వాత విస్తృతంగా అందుబాటులోకి తెస్తారు. ప్రస్తుత కాగితపు నోట్లు రద్దు కావు, ప్లాస్టిక్ నోట్లతో పాటు సమాంతరంగా చలామణిలో ఉంటాయి.
ఇదే సమయంలో రూ.1000 ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. "రూ.1000 ప్లాస్టిక్ నోటు విడుదల చేస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం, నకిలీవి. ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు" అని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి పెద్ద నోట్లలో ప్లాస్టిక్ కరెన్సీ ఆలోచన లేదని అధికారులు తెలిపారు.

Post a Comment