SP Inspection | ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు - ఎస్పీ

భిక్నూర్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ నిర్వహించిన ఎస్పీ రాజేష్ చంద్ర

నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు, ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు - ఎస్పీ

పెండింగ్ కేసులపై ప్రత్యేక కార్యాచరణ, రాత్రి గస్తీ పటిష్టం చేయాలని ఆదేశం

కామారెడ్డి, అక్టోబర్ 29:కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర వార్షిక తనిఖీలో భాగంగా భిక్నూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.

ముందుగా పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో నేరాల తీరు, అనుమానిత వ్యక్తులు, రౌడీషీటర్ల వివరాలు, వారి కదలికలపై ఆరా తీసి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌లోని కేసు ఫైళ్లు, వివిధ రికార్డుల నిర్వహణను పరిశీలించి ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. రోల్‌కాల్‌ను పరిశీలించి టెలికాన్ ఫ్రెండ్స్ ద్వారా సమాచారం సక్రమంగా చేరుతుందా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితుల సమస్యలను ఓపికగా విని చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సమీక్షించి దర్యాప్తులో జాప్యం లేకుండా సాక్ష్యాధారాలు సేకరించాలన్నారు. శాస్త్రీయ పద్ధతులతో దర్యాప్తు పకడ్బందీగా పూర్తి చేసి నిర్ణీత గడువులో చార్జిషీట్లు దాఖలు చేయాలని, పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీ పటిష్టం చేసి దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి వారి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, హెల్మెట్, డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగంపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు.

పోలీస్ స్టేషన్‌లోని కేసు డైరీలు, జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు తదితర రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ స్పష్టం చేశారు.

ఈ తనిఖీలో కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, భిక్నూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జె. నరేష్, భిక్నూర్ ఎస్హెచ్ఓ అనిల్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.





Post a Comment

Previous Post Next Post